ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షానికి సరిపడా సీట్లు సంపాదించినా, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరడంతో హస్తం కుదేలైంది. దీంతోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఎంఐఎంకే చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలాకు ఈ పదవి ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. చివరకు అక్బరుద్దీన్ పేరు ఖరారైంది. పీఏసీ చైర్మన్‌కు కేబినెట్ హోదా ఉంటుంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించి. ఆ పార్టీకి 99 సీట్లు వచ్చాయి. ఎంఐఎం 44 చోట్ల జెండా ఎగరేసింది. బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, టీడీపీ నుంచి ఒక కార్పొరేటర్ గెలిచారు.దీంతోపాటు మరికొన్ని కమిటీలను కూడా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ చైర్మన్‌గా ఆశన్నగారి జీవన్‌రెడ్డి,పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, అబ్రహం, శంకర్‌నాయక్, దాసరి మనోహర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, అహ్మద్ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్‌లను నియమించారు. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నడిచాయి. 58 గంటల 6 నిమిషాలు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశంలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.
