సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజుతండాలో వీర జవాన్ గుగులోతు నరసింహ నాయక్ విగ్రహానికి అక్క చెల్లెల్లు రాఖీ కట్టారు. వారి కున్న ఒక్కగానొక్క సహోదరుడైన నరసింహ నాయక్ సిఆర్పిఎఫ్ జవాను గా పనిచేస్తూ 2014 లో ఛత్తీస్ ఘడ్ లో నక్సలైట్లు అమర్చిన మందుపాతర పేలిన దుర్ఘటనలో వీరమరణం చెందారు. అప్పటినుండి తమ సహోదరుని సమాధి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి నరసింహ నాయక్ విగ్రహానికి రాఖీ కట్టి అక్క చెల్లెలు తమ అనుబంధం పంచుకుంటున్నారు. విగ్రహం లోనే తమ సహోదరున్ని చూసుకుంటూన్నారు. అందరూ అక్కచెల్లెళ్లు అన్నదమ్ములకు సంతోషంగా రాఖీ కడుతుంటే, తన కుమార్తెలు మాత్రం తమ సహోదరుని విగ్రహానికి ప్రతి సంవత్సరం ఏడ్చుకుంటూ రాఖీలు కడుతున్నారని నరసింహ నాయక్ తండ్రి లింగయ్య నాయక్ విలపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని, వృద్ధాప్య దశలో ఉన్న తమను చూసుకునేందుకు తమ చిన్న కుమార్తె కు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి తమను ఆదుకోవాలని వీర జవాన్ తండ్రి లింగయ్య నాయక్, సత్తమ్మ లు కోరుతున్నారు. అమర జవాన్ నరసింహ నాయక్ విగ్రహానికి అక్క చెల్లెల్లు రాఖీలు కట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.