పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దళితులను ఎలా విస్మరించారో అలాగే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం వెళుతోందని మండిపడ్డారు. నరేంద్ర మోదీ రాజ్యంలో దేశంలోని దళితులు, గిరిజనులు, మైనారిటీల స్థానం ఎక్కడుందో చెప్పాలని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సవరణ బిల్లు–2018పై జరిగిన చర్చలో బాల్క సుమన్ ప్రసంగించారు. మోదీ రాజ్యంలో దళితులు, గిరిజనులు, మైనారిటీల స్థానం ఎక్కడో ఆయన మన్‌కీబాత్‌లో చెప్పాలని హితవు పలికారు. గత పదేళ్లలో దళితులపై దాడులు 66 శాతం పెరిగాయని, ప్రతి 15 నిమిషాలకో దాడి, రోజూ ఆరుగురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలోని దళితులు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం పొంది, సమానత్వంతో ఉన్నామన్న భావన కలిగే దాకా రిజర్వేషన్లు ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి వివాదాస్పద తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరిని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్మన్‌గా నియమించడాన్ని తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వానికి దళితులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్జీటీ చైర్మన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయవ్యవస్థ ఉన్నత హోదాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని పేర్కొన్నారు.