రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న’రైతుబంధు’ పథకం దేశానికి దిక్సూచీల నిలుస్తున్నది. తెలంగాణ బాటలో రైతులకు అండగా నిలిచేందుకు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. తమ రాష్ట్రంలో రైతుబంధు తరహా పథకాలు అమలు చేయాలని నిర్ణయించాయి. ఈ పథకం ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత ఒడిశా ప్రభుత్వం ‘కాలియా’ పేరుతో రైతుబంధు తరహా పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. జార్ఖండ్ ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేలు అందించే పథకానికి రూపకల్పన చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్నంగా అమలు చేసిన ఈ పథకం దేశంలోని వివిధ రాష్ట్రాలను ఆకట్టుకున్నది. దీంతో తమ రాష్ట్రాల్లో ఇలాంటి పథకాన్ని అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాల్లో మంత్రులు, అధికారుల బృందాలు తెలంగాణాలో పర్యటించాయి.కర్ణాటక ,అస్సోమ్,పంజాబ్ తదితర రాష్ట్రాల బృందాలు పరిశీలించడమే కాకుండా,కేంద్ర మంత్రుల బృందం ప్రత్యక్షంగా తెలంగాణ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ.పార్థసారధిని ఢిల్లీకి పిలిపించుకొని ఈ పథకం పై చర్చించింది.దేశంలోని అన్ని రాష్ట్రాలు రైతుబంధు పథకాన్ని అమలు చేయాలని ‘నీతిఆయోగ్’ సమావేశంలో చర్చించడం విశేషం.ఐక్యరాజ్య సమితిలోని ప్రపంచ వ్యవసాయ,ఆహార విభాగం(ఎఫ్ఏఓ)ప్రపంచ వ్యాప్తంగా 198 దేశాల్లో వ్యవసాయానికి సంబంధించి అమలు చేస్తున్న 700 పథకాలను పరిశీలించి 20 నూతన ఆవిష్కరణలను ఎంపిక చేసింది.ఈ జాబితాలో మన దేశం నుంచి రైతుబంధు ఎంపికైంది.ఈ పథకం అమలుతీరు ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నది.కేంద్ర ఆర్ధికశాఖ మాజీ సలహాదారు సుబ్రహ్మణ్యం ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం కెసిఆర్ ప్రారంభించిన రైతుబంధు వంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయటం తప్పనిసరి అని చెప్పారు.ఈ క్రమంలోనే ఒడిశా,జార్ఖండ్ రాష్ట్రాలు రైతుబంధు తరహాలో తమ రాష్ట్ర రైతులకు ఆర్థిక అండ అందించేలా పథకాలను ప్రారంభించనుండటం విశేషం.