మోదీ మాటలతో ప్రయోజనం శూన్యం- అనురాగ్ కశ్యప్

బాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకొని బీజేపీ, దాని అనుబంధ సంస్థలు సృష్టించిన వివాదాలపై ప్రధాని మోదీ ఇన్నాళ్లు మౌనం వహించారని, ఇప్పుడు నష్టనివారణకు పూనుకోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండబోదని ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ నాలుగేండ్ల క్రితం ఈ మాటలు చెప్పి ఉంటే ఏమైనా ప్రయోజనం ఉండేదని, ఇప్పుడు పరిస్థితులు చేజారిపోయాయని అన్నారు. సినిమాలపై అనవసర వివాదాల్ని సృష్టించొద్దంటూ ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పార్టీ కార్యకర్తలకు సూచించిన విషయం తెలిసిందే. గురువారం ముంబైలోతన చిత్రం ‘ఆల్‌మోస్ట్‌ ప్యార్‌ విత్‌ డీజే మొహబ్బత్‌’ ట్రైలర్‌ ఆవిష్కరణలో ప్రధాని వ్యాఖ్యలపై కశ్యప్‌ స్పందించారు. ఈర్ష్యా ద్వేషాలను నిశ్శబ్దంగా, ఓ ప్రణాళికా ప్రకారం యువత మనసుల్లోకి జొప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు ఆ వినాశక మూక అత్యంత శక్తిమంతంగా మారింది. దానిని అదుపు చేయడం ఎవరి వల్లా కాదు. వారు ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇన్నేండ్ల తర్వాత ప్రధాని తన సొంత మనుషులు నియంత్రణలో ఉండాలని కోరడం విడ్డూరం’ అని పేర్కొన్నారు.

బాలీవుడ్‌ సినిమాల విషయంలో బీజేపీ, సంఘ్‌పరివార్‌ అనుసరిస్తున్న అనుచిత వైఖరిపై తొలి నుంచి నిరసన గళాన్ని వినిపిస్తున్నారు అనురాగ్‌ కశ్యప్‌. గత ఏడాది వ్యాప్తిలోకి వచ్చిన బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా’, రణ్‌బీర్‌కపూర్‌ ‘బ్రహ్మాస్త్ర’, అక్షయ్‌కుమార్‌ ‘రక్షాబంధన్‌’, విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ చిత్రాలు నిరుడు బాలీవుడ్‌లో బాయ్‌కాట్‌ సెగను ఎదుర్కొన్నాయి. ఇటీవల ‘పఠాన్‌’ చిత్రంలోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాటలో కథానాయిక దీపికా పదుకొణె ధరించిన బికినీ రంగుపై కూడా తీవ్ర దుమారం చెలరేగింది. ఈ వివాదాల నేపథ్యంలో సినీరంగంపై ప్రధాని మోదీ చేసిన తాజా వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

error: