సిద్దిపేటలో కొన్నేళ్లుగా అనుకున్న అన్ని పనులు చేసుకున్నా పరిశ్రమల ఏర్పాటులో కొంత ఆలస్యం అయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉందని, అలాగే పరిశ్రమల ఏర్పాటులోనూ ముందుంటామని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. మలేషియాకు చెందిన డీఎక్స్ఎన్ కంపెనీ సమీకృత వ్యవసాయ ఆధార పరిశ్రమకు మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి శివారులో 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.175 కోట్లతో ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు.
డీఎక్స్ఎన్ కంపెనీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని మంత్రి ప్రశంసించారు. కాలుష్య రహిత పరిశ్రమతో దాదాపు 1500 మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ముందుచూపుతో పని చేస్తున్నారని చెప్పారు. గత ముఖ్యమంత్రులు ఆ రోజుకు తమకేం లాభమని ఆలోచిస్తే, సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నారని అన్నారు.
నంగనూర్ మండలం నర్మెటలో జపాన్ కు చెందిన ఎగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నదని మంత్రి హరీశ్ ప్రకటించారు. సిద్దిపేటలో ఉన్న 22 మంది రైస్ మిల్లర్లకు కూడా ఇక్కడ స్థలం కేటాయిస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఒకటి 100 ఎకరాల్లో ఫర్నిచర్ పార్క్, మరో వంద ఎకరాల్లో పశ్చిమ బెంగాల్ కు చెందిన శ్రేయిన్ ఫుడ్ పార్క్ రానున్నదన్నారు. ఈ ప్రాంతానికి రెండు జాతీయ రహదారులకు అనుసంధానం చేసే దిశగా రహదారులు నిర్మిస్తామని హరీశ్ ప్రకటించారు.