రాష్ర్టంలో ఏ ఒక్క ప్రైవేటు కాలేజీకి ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వలేదు.. ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభం కాలేదు.. అయినా అధికారులు మాత్రం 2020–21 విద్యా సంవత్సరానికి సెప్టెంబర్ ఒకటి నుంచే క్లాసులు ప్రారంభమైనట్టు ప్రకటించారు. ఈ మధ్య అధికారులు రిలీజ్ చేసిన అకడమిక్ క్యాలెండర్ పైనా గందరగోళం నెలకొన్నది. సెప్టెంబర్ 1 నుంచే కాలేజీలు ప్రారంభం అని ఆగస్టు 31న తేదీతో సెప్టెంబర్ 10న అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీంతో ఫస్టియర్ అడ్మిషన్లే ప్రారంభం కానప్పుడు, అకడమిక్ క్యాలెండర్ ఎలా రిలీజ్ చేస్తారని పేరెంట్స్, స్టూడెంట్స్ యూనియన్ల నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో కనీసం సెకండియర్ స్టూడెంట్స్‌కు అధికారికంగా డిజిటల్ క్లాసులకు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయా కాలేజీల్లో చదువుతున్న మూడున్నర లక్షల మంది స్టూడెంట్లు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
సర్కారు కాలేజీలకే అనుమతి..
2019–20 లెక్కల ప్రకారం స్టేట్‌లో 2,570 జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇచ్చింది. వీటిలో 404 సర్కారు, 680 ప్రభుత్వ సెక్టార్ (గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్), 1,486 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఏటా జూన్ 1 నుంచి క్లాసులు మొదలవుతాయి. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో కాలేజీలు ప్రారంభం కాలేదు. మరోవైపు కాలేజీల రెన్యువల్ ప్రాసెస్ కూడా పూర్తికాలేదు. అకడమిక్ ఇయర్ ఆలస్యమవుతుండటంతో ఈ నెల 1 నుంచి టీవీల ద్వారా సర్కారు, ఎయిడెడ్ కాలేజీల స్టూడెంట్స్‌కు క్లాసులు చెప్పేందుకు సర్కారు అనుమతి ఇచ్చింది. అయితే ప్రైవేటు కాలేజీల్లోని స్టూడెంట్ల విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈనెల1 నుంచి అకాడమిక్ క్యాలెండర్ మొదలైనట్టు ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ ప్రకటించారు.
ఆందోళనలో స్టూడెంట్లు, పేరెంట్స్
ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 3.78 లక్షల మంది స్టూడెంట్లు, కరోనా ఎఫెక్ట్‌తో ఆరు నెలలుగా ఇండ్ల వద్దే ఉన్నారు. ఈ ఏడాది ప్రైవేటు కాలేజీలకు గుర్తింపు లేదనే కారణంతో ఆన్లైన్, డిజిటల్ క్లాసులకు ఇంటర్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. దీంతో స్టూడెంట్స్ భవిష్యత్ ఏమవుతుందో అని వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. పలు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో దొంగచాటుగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. బయటకు తెలిస్తే బోర్డు ఫైన్ వేస్తుందనే భయంతో చాలా కాలేజీలు ఆన్లైన్ క్లాసులు పెట్టేందుకు ముందుకు రాలేదు. సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ క్లాసులు మొదలుపెట్టుకోవచ్చని భావించిన ప్రైవేటు మేనేజ్మెంట్లకు ఇటీవల బోర్డు ఇచ్చిన ఉత్తర్వులు షాక్ నిచ్చాయి. సర్కారు కాలేజీలకే అనుమతి ఇవ్వడంతో, తమ స్టూడెంట్ల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
అకడమిక్ క్యాలెండర్ పై సక్కగ లేదు
అకడమిక్ క్యాలెండర్ ను అధికారులు రిలీజ్ చేసిన కొన్ని రోజులకు క్లాసులు ప్రారంభిస్తారు. 2019లో క్లాసులు ప్రారంభించేందుకు 15 రోజుల ముందు, 2018లో 40 రోజుల ముందు క్యాలెండర్ రిలీజ్ చేశారు. కానీ 2020లో మాత్రం ఒకే రోజు ముందు అకడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. దీనికితోడు ఇప్పటికీ ప్రైవేటు కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదు. మరోపక్క సర్కారు కాలేజీల్లోనూ అడ్మిషన్లకు పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటప్పుడు సెప్టెంబర్ 1 నుంచి అకడమిక్ క్యాలెండర్ ప్రారంభమైనట్టు ఎలా ప్రకటిస్తారని ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు ప్రశ్నిస్తున్నాయి.
3 నెలలుగా కొనసాగుతున్న ప్రక్రియ
ఈ ఏడాది కాలేజీల రెన్యువల్ కోసం మే నెలలో ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. పలుమార్లు గడువు పెంచింది. ఆగస్టు 30తో గడువు ముగియగా, గతేడాది ఉన్న కాలేజీలన్నీ అప్లై చేశాయి. ఫైర్ ఎన్ఓసీ లేకపోవడంతో చాలా అప్లికేషన్లను, తిరిగి ఆయా కాలేజీల లాగిన్లకే అధికారులు పంపించారు. రెండు నెలలుగా ప్రభుత్వం, మేనేజ్మెంట్ల మధ్య చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వం ఫైర్ ఎన్ఓసీ రూల్స్ ను సడలించకపోతే, సుమారు 1,200లకు పైగా కాలేజీలకు గుర్తింపు రావడం కష్టమేనని తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఫైర్ ఎన్ఓసీపై విద్యాశాఖ, హోంశాఖ మంత్రులు అధికారులతో సమావేశమయ్యారు. కొంతచర్చ జరిగినా, ఫైర్ఎన్ఓసీపై స్పష్టత రాలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో అసలు ప్రైవేటు కాలేజీలకు గుర్తింపు ఇస్తారా.. ఇవ్వరా అనే ఆందోళనలో పేరెంట్స్, మేనేజ్మెంట్లు ఉన్నాయి.