ఆస్తి కోసం అన్న చావుకు కారణమైన తమ్ముడు

ఆస్తి కోసం తోడబుట్టిన అన్నను కాదు అనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు . తండ్రి సంపాదించిన ఆస్తిని తమ్ముడు ఒక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో మనస్తాపానికి గురైన అన్న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మిరుదొడ్డి మండలంలో చోటుచేసుకుంది . సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బేగం పేట గ్రామానికి చెందిన మంగయ్య , కృష్ణారెడ్డి ఉరి వేసుకొని గుంటూరు జిల్లా చేవెళ్లపురంలో ఈ నెల 23 న ఆత్మహత్యకు పాల్పడ్డాడు . ఆత్మహత్యకు తన తమ్ముడు కొండల్ రెడ్డి కారణమంటూ బంధువులు , గ్రామస్తులు ఆరోపించారు . కృష్ణారెడ్డి తండ్రి నరసింహారెడ్డి బేగంపేట వద్ద 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి తన భార్య పేరున రెండెకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశాడు . కొద్ది రోజులకు నరసింహా రెడ్డి మృతి చెందడంతో తన పేరున ఉన్న భూమిని చిన్న కొడుకు కొండల్ రెడ్డి ఒక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో , కృష్ణా రెడ్డి , కొండల్ రెడ్డికి మధ్య విభేదాలు మొదలయ్యాయి . కృష్ణారెడ్డి గ్రామస్తులను ఆశ్రయించి తన పేరుపై నాలుగు ఎకరాల భూమిని చేయాలని తమ్ముడుని కోరినట్లు గ్రామ పెద్దలు తెలిపారు . తన పేరున చేస్తానని హామీ ఇచ్చిన కొండల్ రెడ్డి ముఖం చాటేయడంతో మనస్థాపానికి గురైన కృష్ణారెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు . కృష్ణా రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి తమ్ముడు కొండల్ రెడ్డి కారణమంటూ శవాన్ని బేగంపేటలోని తన ఇంట్లో వేసి బంధువులు , గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు . గుంటూరు నుండి అన్న శవాన్ని ఇంటికి తీసుకువచ్చిన కొండల్ రెడ్డి ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడం పై బంధువులు మండిపడుతున్నారు . ఇప్పటికైనా కొండల్ రెడ్డి పంతాన్ని వీడి తన అన్న కొడుకులకు భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు . చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన హర్షవర్ధన్ రెడ్డి , రోహిత్ రెడ్డి ఇప్పుడు తండ్రిని కోల్పోయి బిక్కుబిక్కుమంటూ రోదించడంతో అక్కడున్నవారు కన్నీటి పర్యంతమయ్యారు

error: