ఈటల,కొండా చూపు కాంగ్రెస్ వైపు!

ఈటల,కొండా చూపు కాంగ్రెస్ వైపు!

బీజేపీ సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. ‘త్వరలో కాంగ్రెస్‌లోకి బీజేపీ సీఎం అభ్యర్థి’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నిహితుడిగా పేరున్న సామ రామ్మోహన్‌రెడ్డి ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ సీఎం అభ్యర్థులుగా ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌ పేర్లు వినిపించాయి. ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న బండి సంజయ్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌లో చేరరని, కాబట్టి రామ్మోహన్‌రెడ్డి చెప్పింది ఈటల గురించేనని భావిస్తున్నారు. ఈటలతోపాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్నది. బీజేపీలో తమకు భవిష్యత్తు లేదని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారని, పార్లమెంట్‌ ఎన్నికలలోపు పార్టీ మారతారని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో బీజేపీలో అంతర్గతంగానూ, సోషల్‌ మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన కరీంనగర్‌ టికెట్‌ ఆశిస్తున్నట్టు సమాచారం. అయితే సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌కి టికెట్‌ ఇవ్వాలని భావిస్తున్న పార్టీ నేతలు.. మెదక్‌ లేదా మల్కాజిగిరి స్థానాల్లో ఒకదానిని ఎంచుకోవాలని సూచించినట్టు తెలుస్తున్నది. ఆ రెండింటిలో ఎక్కడ పోటీ చేసినా ప్రజలు తనను ‘నాన్‌ లోకల్‌’గానే చూస్తారన్నది ఈటల వర్గం భావిస్తున్నది. అందుకే కరీంనగర్‌ తప్ప వేరే సీటు వద్దని వాదిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి కరీంనగర్‌లో సరైన అభ్యర్థి లేడని, ఈటల వెళ్తే కచ్చితంగా టికెట్‌ లభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం ఉండదని, ఆ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు కష్టమేననే భావనకు వచ్చినట్టు తెలిసింది. చేవెళ్లలో కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి లేకపోవడంతో తనకు అవకాశం ఉంటుందని కొండా భావిస్తున్నట్టు సమాచారం.

ముదిరిన బండి, ఈటల గొడవలు

బీజేపీలో బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. వీరిద్దరి మధ్య చాలాకాలంగా కోల్డ్‌వార్‌ నడుస్తున్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్ఠానం జోక్యంతో కొంత సద్దుమణిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత మళ్లీ విభేదాలు రచ్చకెక్కాయి. సోషల్‌మీడియాలో ఒక వర్గం మీద మరో వర్గం దుమ్మెత్తిపోస్తున్నది. తాము పోటీ చేసిన స్థానాల్లో ఇద్దరూ ఓడిపోవడంతో ఒకరి మీద మరొకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మరో ఆసక్తికర పరిణామం జరిగింది. నోవాటెల్‌ హోటల్‌లో బీజేపీ సీనియర్‌ నేతలతో సమావేశమైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. వీరిద్దరి విభేదాలపై సూటిగా ప్రశ్నించినట్టు తెలిసింది.

క్రమశిక్షణ పాటించాలని, పార్టీ నిర్ణయాలను గౌరవించాలని ఇద్దరికీ క్లాస్‌ పీకినట్టు సమాచారం. సోషల్‌ మీడియాలో బండి, ఈటల వర్గాలు చేస్తున్న రచ్చను ప్రత్యేకంగా ప్రస్తావించి, అందరి ముందే తలంటినట్టు తెలిసింది. ఇద్దరూ కలిసి మీడియా సమావేశం నిర్వహించి తమ మధ్య విబేధాలు లేవని చాటాలని అమిత్‌షా ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు ఇద్దరు నేతలు కలిసి మీడియాతో మాట్లాడుతారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం సమాచారం ఇచ్చింది. కానీ, సమయానికి ఈటల రాజేందర్‌ ఒక్కరే రాగా, బండి సంజయ్‌ డుమ్మా కొట్టారు. దీంతో అమిత్‌షా చెప్పినా బండి వినలేదంటూ ఈటల వర్గం మండిపడుతున్నది.

error: