ఓ నేత …

ఎక్కడ తెగుతాయో తెలియని చెప్పుల గూడలు
ఎక్కడ ఆగుతాయో తెలియని చప్పుళ గుండెలు

అదో బిలము
అదే దళము

తెగిన దారాన్ని అతికించిన నాలికమీది తడి
ఆరిపోయి నూరిపోయి నేతన్న గొంతు కోసి అదే నాలికని బయటకు తీసింది

అదే జంధ్యము
ఆయనో జఠధారి

నగ్నంగా తిరుగుతున్న భూమికి బట్టకట్టి బయలుదేరాడతను భూమిని తన్నీ

అదో యజ్ఞమ్
అతనో ముని

మిత్తి కట్టలేక నెత్తిని బూడిదలో దాచాడు
తలదిండు తీసి ఏకంగా తల తాకట్టు పెట్టాడు ఊరిబయట
అదో సౌధం
ఆయనో రాజు

అటుఇటు తిరుగుతూ ఊపిరాడని జోటని చంటిపాపలా చేతిలోకి తీసుకుని
నల్లపూస గుచ్చినంత అందంగా జోటపూసలోనికి శ్వాసని గుచ్చుతాడు

అతనో అమ్మ
చేనేతని కన్న బ్రమ్హ

సాంచకి గుండెని వజ”నేసి”చర్మాన్ని మార్ దండకి చెమ్డగ కట్టి పసిపాప ఊయలకి చీరవుతాడు

అతనో సారధి
చర్మాలపైకి వస్త్రాలని
తెచ్చిన వారధి

కడుతో రాసిన రాత
కడువతో ముగుస్తుంది.ఓ నేత

-పాళీ-

error: