కవిత బెయిల్ మంజూరు సంచలన నిజాలు..

కవిత తిహాడ్ జైలులో ఉన్నప్పుడు ఏం జరిగింది..!?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందో..? రాదో..? అని అరెస్టయిన మార్చి-15 నుంచి ఆగస్టు-27 వరకూ ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. సుమారు గంటన్నరకు పైగానే సుప్రీంకోర్టులో ఈడీ తరఫు, కవిత తరఫు లాయర్ల మధ్య వాడీవేడిగా వాదనలు జరిగాయి. అంతకుమించి ప్రశ్నల వర్షం.. లాయర్లు ఒకరిపై ఒకరు కన్నెర్రజేసుకోవడం ఇవన్నీ జరిగాయి. మధ్యలో కలుగజేసుకున్న ధర్మాసనం సైతం అటు ఈడీ.. ఇటు కవిత లాయర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది. చివరికి కవితకు అయితే బెయిల్ మంజూరైంది. దీంతో గులాబీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. కవిత అరెస్ట్ అయినప్పట్నుంచీ నిన్న మొన్నటి వరకూ తిహాడ్ జైలులో పడ్డ ఇబ్బందులేంటి..? కవిత ఎన్నిసార్లు అస్వస్థతకు లోనయ్యారు..? కవిత ఎన్ని కేజీలు బరువు తగ్గారు..? అనే విషయాలపై ప్రత్యేక కథనం..!

రెండు సార్లు ఇలా..!

తిహాడ్ జైలులో ఉండగా కవిత రెండు సార్లు అస్వస్థతకు లోనయ్యారు. జూలై 16న తొలిసారిగా కవితను ఢిల్లీలోని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందించారు. ఆ తర్వాత ఆగస్టు-22న మరోసారి కవిత అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి, తిరిగి జైలుకు తీసుకెళ్లారు. కొంతకాలంగా కవిత గైనిక్‌ సమస్యలతో బాధపడుతూ ఉండటం.. దీనికి తోడు ఇటీవల వైరల్‌ జ్వరం బారినపడ్డారు. దీంతో.. కవిత భర్త అనిల్‌ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు.

బరువు తగ్గారా..?

కవిత జైలులో ఉండగా 11 కిలోల బరువు తగ్గారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పడంతో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి. అంతేకాదు.. సోదరి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన అన్న.. ఒక్కొక్కటిగా బయటికి చెప్పారు. కవితకు బీపీ పెరగడంతో మాత్రలు వేసుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. అంతేకాదు.. జైలు శుభ్రంగా లేదని, కవిత చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 11 వేల మంది ఖైదీలు ఉండాల్సిన తిహాడ్‌ జైల్లో 30 వేల మంది ఉన్నారన్నారు. అదే రోజున కవితకు త్వరలోనే బెయిల్‌ వచ్చే అవకాశాలున్నాయని అలా చెప్పారు.. ఇలా రోజుల వ్యవధిలోనే ఆగస్టు-27న కవితకు బెయిల్ వచ్చింది. దీంతో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఎన్ని సార్లో..!

ఇక కవిత బెయిల్ పిటిషన్ విషయానికొస్తే.. బెయిల్ కవిత పెద్ద పోరాటమే చేసిందని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. ఓ వైపు కవిత.. మరోవైపు బీఆర్ఎస్ పెద్దలు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు.. ఆఖరిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ ఎన్నోసార్లు విచారణ జరగడం, వాయిదా పడటంతో రోజురోజుకూ టెన్షన్ పెరిగిపోయింది. మంగళవారం నాడు ఉదయం నుంచి నరాలు తెగే ఉత్కంఠ.. బెయిల్ వస్తుందా..? కవిత మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందా..? అనేదానిపై హైటెన్షన్ నెలకొంది. ఓ వైపు కవిత తరఫు లాయర్లు.. మరోవైపు ఈడీ తరఫు లాయర్ల వాడీవేడి వాదనలతో ఏం జరుగుతుందో అని ఒక్కటే టెన్షన్. కవిత బయటికి వస్తుందా..? రాదా..? అని ఆర్డర్ కాపీ చదివేటప్పుడు జనాలంతా మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు టీవీలు, యూట్యూబ్‌లకు అతుక్కుపోయారు. కవితకు బెయిల్ అని ఎప్పుడైతే వార్త వచ్చిందో హమ్మయ్యా.. అని గులాబీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి..

error: