గ్రూప్‌-1 ప్రశ్నపత్రం ఎంత మందికి చేరవేశారు? ఎంత మందికి వంద దాటాయి?

గ్రూప్‌-1ప్రిలిమ్స్‌లో ఎంత మందికి వందకు పైగా మార్కులు వచ్చాయనేదానిపై ఇప్పుడు సిట్‌ దర్యాప్తు చేస్తున్నది. నిందితులను కస్టడీలో విచారించటంతో పాటు వారి వద్ద లభించిన సాంకేతికపరమైన ఆధారాలను అధికారులు ధ్రువీకరిస్తున్నారు. దీని సాయంతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు. గ్రూప్‌-1 పరీక్షలో సుమారు 25 వేల మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. అందులో 100 స్కోర్‌ దాటిన వారు ఎంతమంది ఉన్నారు? వారికి ప్రవీణ్‌, రాజశేఖర్‌, రేణుకకు ఎలాంటి సంబంధాలున్నాయనే అంశాలపై ఫోకస్‌ పెట్టారు. ఈ వివరాల ఆధారంగా ఎంత మంది వీరితో టచ్‌లో ఉన్నారనే విషయాలను తేల్చనున్నారు.

రాజశేఖర్‌ పాత్ర కీలకం
పేపర్‌ లీకేజీలో రాజశేఖర్‌ కీలకంగా వ్యవహరించాడనే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా రాజశేఖర్‌కు పట్టు ఉండటం, ప్రవీణ్‌ కార్యదర్శి పీఏ కావటంతో వీళ్లిద్దరూ లోపల ఎక్కడ తిరిగినా మిగతా సిబ్బంది అంతగా పట్టించుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని పేపర్‌ లీకేజీకి పాల్పడ్డారు. టీఎస్‌పీఎస్సీ ఏఈ పేపర్‌ లీకేజీ ఘటనలో రెండో రోజు నిందితులను సిట్‌ విచారించింది. ఇందులో భాగంగా సాంకేతిక అంశాలపైనే దృష్టి పెట్టింది. నగర అదనపు పోలీస్‌ కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌, సైబర్‌క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌, సిట్‌ ఏసీపీ వెంకటేశ్వర్ల బృందం నిందితులను విచారిస్తున్నది.

రాజశేఖర్‌ వాట్సాప్‌ డాటాను విశ్లేషించగా అనుమానాస్పద పోస్టులు లభించాయి. రాజశేఖర్‌, ప్రవీణ్‌, రేణుక ప్రశ్నపత్రాన్ని ఎంతమందికి అమ్మారన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలను కూడా విశ్లేషిస్తున్నారు. అటు.. గ్రూప్‌-1 పేపర్‌లో హాల్‌టికెట్‌ నంబర్‌ బబ్లింగ్‌ను ప్రవీణ్‌ పక్కా ప్లాన్‌తోనే తప్పుగా బబ్లింగ్‌ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిర్ధారణ కోసం నిందితుల ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లను విశ్లేషించటంతో ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్నది.

30 ప్రశ్నలపైనే ఫోకస్‌
నిందితుల నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు సిట్‌ అధికారులు 30 ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. రెండు రోజులుగా ఒక్కొక్కరిని విచారిస్తూ, అవసరమైనప్పుడు ఇద్దరినీ ఒకేసారి విచారించారు. 2 రోజులుగా పోలీసులు ప్రధాన నిందితులైన రాజశేఖర్‌, ప్రవీణ్‌, రేణుకతో పాటు మిగిలిన నిందితుల నుంచి సమాచారాన్ని సేకరించారు. సోమవారం నుంచి అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి సిట్‌ విచారించనున్నది.

error: