చనిపోయిన వారు మళ్ళీ బతికితే …

చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికితే? శరీరాన్ని భద్రపరిచి వైద్యం చేసి పునర్జన్మ ప్రసాదిస్తే? ఇదేదో సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీ అనుకొంటున్నారా? కానీ, నిజం చేసి చూపిస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. ఫిక్షన్‌ కాదు.. సైన్స్‌ స్టామినాను ప్రపంచానికి చాటుతామంటున్నారు. అయితే, ఇప్పుడు కాదు.. భవిష్యత్తులో! భవిష్యత్తు టెక్నాలజీపై ఉన్న భరోసాతో కొందరు శరీరాలను ‘క్రయోనిక్స్‌’ పద్ధతిలో భద్రంగా ఉంచుతున్నారు. ఆ కోవలోకి దాదాపు 500 మంది చేరారు. ఇలా శరీరాలను భద్రపరిచే కంపెనీ కూడా ఉన్నదంటే నమ్ముతారా? అమెరికాలోని అరిజోనాలో ఉన్న అల్కర్‌ లైఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఫౌండేషన్‌ ఫెసిలిటీ.. శరీరాలను దశాబ్దాల తరబడి పాడవకుండా కాపాడుతున్నది.

ఈ కంపెనీ వద్ద 199 మనిషి శరీరాలు, 100 పెంపుడు జంతువుల శరీరాలు భద్రంగా ఉన్నాయి. మొత్తం శరీరాన్ని భద్ర పర్చాలంటే రూ. కోటిన్నర, కేవలం మెదడును భద్రపర్చాలంటే రూ.65 లక్షలు వసూలు చేస్తున్నామని అల్కర్‌ నిర్వాహకులు పేర్కొన్నారు.

మనిషి చనిపోయాడని చట్టబద్ధంగా నిర్ధారించిన మరుక్షణమే వ్యక్తి శరీరం నుంచి రక్తాన్ని, ఇతర ద్రవ పదార్థాలను తొలగించి, రసాయనాలతో నింపుతారు. పెద్ద స్టీల్‌ ట్యాంకుల్లో ద్రవరూప నైట్రోజన్‌ను నింపి అందులో శరీరాన్ని భద్రపరుస్తారు. ఈ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత -196 డిగ్రీలు ఉంటుంది. దీనివల్ల శరీర కణజాలాలు, ఇతర అవయవాలు పాడుకాకుండా ఉంటాయి. ఈ ప్రక్రియనే క్రయోనిక్స్‌ అంటారు.

గుండె కొట్టుకోవటం ఆగిపోగానే మరణ ప్రక్రియ పూర్తి కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరంలోని కణజాలాలు, కండరాలు, అవయవాలు అచేతనంగా మారటానికి కొంత సమయం పడుతుందని చెప్తున్నారు. అవి అచేతనంగా మారకముందే గడ్డకట్టిస్తామని తెలిపారు. అయితే, పునర్జన్మ ప్రసాదించటంపై మాత్రం ఇప్పుడే ఏం చెప్పలేక పోతున్నారు. ప్రస్తుతానికైతే శరీరాన్ని భద్రపర్చగలమని, గుండెను పనిచేయించే టెక్నాలజీ ఇప్పుడు లేదని అంటున్నారు. భవిష్యత్తులో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకొనేలా చేయగలుగుతామని పేర్కొంటున్నారు.

error: