జంతర్ మంతర్ లో జర్నలిస్టులు..

ఇండిపెండెంట్‌ జర్నలిస్టులకు రక్షణేది..?

తెలంగాణలో ఇండిపెండెంట్‌ జర్నలిస్టులు, మీడియా సంస్థలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి లేదని ఇండిపెంటెండ్‌ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు..

రాహుల్‌గాంధీ మీరైనా ముఖ్యమంత్రికి చెప్పండి
ప్రజల కోసం పనిచేస్తే దాడులా?
వాస్తవాలను వెలికితీసే వారిపై కక్ష ఎందుకు?
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
ఢిల్లీలోని రాహుల్‌ ఇంటి వద్ద జర్నలిస్టుల నిరసన

తెలంగాణలో ఇండిపెండెంట్‌ జర్నలిస్టులు, మీడియా సంస్థలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి లేదని ఇండిపెంటెండ్‌ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను ప్రజలమందుంచుతున్న ఆఫీసుల ముందు నయీం గ్యాంగ్‌లతో పహారా కాయిస్తున్నారని, ఏ క్షణం దాడులు చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటున్నామని, ఈ దారుణ పరిస్థితిపై రాహుల్‌గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఢిల్లీలోని రాహుల్‌గాంధీ ఇల్లు, ఏఐసీసీ కార్యాలయం వద్ద వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్వతంత్ర జర్నలిస్టు శంకర్‌ మాట్లాడుతూ.. రుణమాఫీపై గ్రౌండ్‌ రిపోర్టు తీసుకొని.. ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే తమపై దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవటంతో ఇల్లు, ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆందోళనల చేపట్టినట్టు తెలిపారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ జరిగిందా? లేదా? అని తెలుసుకునేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై, తమపై దాడికి తెగబడ్డారని, 30 కిలోమీటర్ల మేర 150 కిలోమీటర్ల వేగంతో కార్లతో వెంబడించి భయభ్రాంతులకు గురిచేశారని వివరించారు. వెల్దండి పీఎస్‌కు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నట్టు వెల్లడించారు. గతంతో ఫిబ్రవరి 22న కూడా తమపై దాడి చేశారని, ఇటీవల ఓయూలో జీ తెలుగు జర్నలిస్టులు, ఇండిపెండింట్‌గా ఉన్న చిలుక ప్రవీణ్‌, ఆకుల శ్రీనివాస్‌రెడ్డి, సరిత, విజయారెడ్డి వంటి వారిపైనా దాడులకు తెగబడ్డారని తెలిపారు..

రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదు
ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే దాడులు చేస్తున్నారని జర్నలిస్టు సుంకరి ప్రవీణ్‌ తెలిపారు. తెలంగాణలో స్వతంత్ర జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టే.. ఢిల్లీ వరకు రావాల్సి వచ్చిందన్నారు. ఏ పెద్ద పనికైనా సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానంతో మాట్లాడేందుకు ఢిల్లీకి వస్తున్నారని, అందుకే సమస్యలు చెప్పుకునేందుకు తాము కూడా ఢిల్లీకి వచ్చినట్టు చెప్పారు. వార్తల కోసం వెళ్లిన వారిపై దాడులు చేస్తూ.. వారి ఆఫీసుల చుట్టూ రెక్కీ చేయటం దారుణమని అన్నారు. తామంతా గతంలోని మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా సంస్థల్లో పనిచేసిన వారిమేనని చెప్పారు. మిస్‌ లీడింగ్‌ వార్తలు రాస్తే తమపై కేసులు పెట్టుకోవచ్చని ఇండిపెండెంట్‌ జర్నలిస్టు ప్రభాకర్‌ చెప్పారు. రాహుల్‌ తెలంగాణకు వచ్చి వీధుల్లో ప్రేమను పంచుతామని చెప్పినా.. ఆ పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కుటుంబసభ్యులే దాడులు చేయడంతో అధిష్ఠానానికి చెప్పేందుకు ఢిల్లీ వచ్చినట్టు వివరించారు..

వినతిపత్రాలు తీసుకోని రాహుల్‌ ఆఫీస్‌
‘సేవ్‌ తెలంగాణ జర్నలిస్టు’ అంటూ ఢిల్లీ వరకు వెళ్లి ఏఐసీసీ, రాహుల్‌గాంధీ కార్యాలయాల్లో వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించినా.. తీసుకునేందుకు సిబ్బంది నిరాకరించినట్టు ఇండిపెండెంట్‌ జర్నలిస్టులు తెలిపారు. దీంతో జంతర్‌మంతర్‌ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రపతి, పీఎం కార్యాలయాల్లో మెమొరాండం ఇచ్చారు. తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై అధికారులకు వివరణ ఇచ్చారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి బంధువుల ఆగడాలు ఆపాలని, దాడులు, కక్షపూరిత చర్యలు మానుకొనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామని, వారి ద్వారా తమకు రక్షణ కల్పించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్రప్రతి, పీఎం కార్యాలయ అధికారులకు విన్నవించారు. నిరసనలో ఇండిపెండెంట్‌ జర్నలిస్టులు లింగస్వామి, ఆకుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు..

error: