క్యూబా సంఘీభావ సభలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అలైడాకు.. తెలంగాణ గడ్డ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఆదివారం ఆమె హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆ అపురూప అతిథి సంక్షిప్త పరిచయం.
చే గువేరా.. పేరు చెబితే పిడికిళ్లు బిగుసుకుంటాయి. చే గువేరా.. నినాదాలు చదివితే యుద్ధావేశం
పొంగుకొస్తుంది. చే.. నడిచే ఆయుధం. హృదయమున్న శతఘ్ని. ఆ ప్రపంచ పౌరుడికి కూడా ఓ కుటుంబం ఉంది. చే గువేరా, ఆయన రెండో భార్య అలైడా మార్చ్‌కి నలుగురు పిల్లలు. అందరి కంటే పెద్ద అలైడా గువేరా. బాల్యం నుంచీ తను బుద్ధిమంతురాలైన విద్యార్థి. మెడిసిన్ చదివింది. హవానాలోని విలియం సోలెర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో పిల్లల వైద్యురాలిగా పనిచేసింది. అంగోలా, ఈక్వెడార్, నికరాగ్వాలలో కూడా వైద్య సేవలు అందించింది. చే గువేరా అధ్యయన కేంద్రాన్ని సమర్థంగా నిర్వహించింది. తను మంచి రచయిత్రి కూడా. హ్యూగో చావెజ్ వెనెజులా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పలుమార్లు ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ సంభాషణల సారంతో ‘చావెజ్, వెనెజులా అండ్ ద న్యూ లాటిన్ అమెరికా’ అనే పుస్తకం రాసింది. చే గువేరా గురించి ప్రపంచమంతా ఆసక్తితో తెలుసుకుంటున్న సమయంలోనూ.. అలైడాకు తన తండ్రి ఏం చేస్తుంటాడో, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. కానీ, తానెక్కడున్నా, చే గువేరా తన పిల్లల్ని మరచిపోలేదు. పోస్టుకార్డుపై బొమ్మలు గీసి పంపేవాడు. స్ఫూర్తిదాయక కథలు రాసి పోస్టు చేసేవాడు. అలైడా పఠనాభిలాష తండ్రి ప్రోత్సాహమే.
చే గువేరా అంటే అలైడాకు చాలా ప్రేమ. హఠాత్తుగా అర్ధరాత్రిళ్లు వచ్చేవాడు. ముద్దుల వర్షం కురిపించేవాడు. అంతలోనే చీకట్లో కలిసిపోయేవాడు. ఉన్న కొద్దిసేపూ ఇల్లంతా సందడే. ‘మా అందరిమీదా నాన్న ప్రభావం ఉంది. ఆయనలానే ఆలోచిస్తాం. ఆయనలానే స్పందిస్తాం’ అంటుంది అలైడా. కాబట్టే, తనకు సామాజిక సేవ ఇష్టమైన వ్యాపకమైంది. అప్పట్లో క్యూబాలో ప్రతి పౌరుడు వారంలో ఒక రోజు సమాజం కోసం పనిచేయాలనే నిబంధన ఉండేది. చే గువేరా తన పిల్లల్ని కూడా పంపేవాడు. శ్రమజీవన సౌందర్యాన్ని బోధించేవాడు. మనుషుల పట్ల ప్రేమనూ, జంతువుల పట్ల కారుణ్యాన్నీ చూపమనేవాడు. అలైడా నాన్న బాటలో నడిచి మంచి వైద్యురాలిగా, మంచి మనిషిగా పేరు తెచ్చుకుంది. అర్జెంటీనా, అంగోలా, ఈక్వెడార్‌లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నది. బ్రెజిల్‌లో పేదల భూపోరాటాల్లో చురుకైన పాత్ర పోషించింది.
అలైడా వాళ్లింట్లో చాలా పుస్తకాలు ఉండేవి. ఓ రోజు వాళ్లమ్మ తన చేతికి ఒక రాతప్రతిని ఇచ్చింది. సాహసాలతో సాగిపోయే ఆ యాత్రా కథనం ఆసక్తికరంగా అనిపించింది తనకు. చివరి పేజీ దగ్గర ఉన్నప్పుడు ‘ఆ సాహస యాత్రికుడు మీ నాన్నే..’ అని చెప్పేసరికి అలైడా ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. అప్పటినుంచీ నాన్నను ఒక యోధుడిగా గౌరవించడం ప్రారంభించింది. ఆ రాత ప్రతే ‘మోటార్ సైకిల్ డైరీస్’ పేరుతో ప్రచురితమైంది. ఆ ప్రపంచ ప్రసిద్ధ పుస్తకానికి తొలి పాఠకురాలు అలైడానే!
క్యూబా విప్లవానంతరం క్యాస్ట్రో ప్రభుత్వానికి భారత్ మద్దతుగా నిలిచింది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో క్యూబా సంఘీభావ యాత్ర జరిపాడు క్యాస్ట్రో. నెహ్రూ కూడా సాదర స్వాగతం పలికాడు. ఇప్పటికీ భారతీయులు తన తండ్రి చే పట్ల, తమ కుటుంబం పట్ల అంతే ఆదరణ చూపుతున్నారని చెబుతుంది అలైడా. క్యూబా సంఘీభావ సమావేశాల్లో పాల్గొనేందుకు తన కూతురితో కలిసి వచ్చిందామె. గతంలోనూ.. 1997, 2019లో భారత్‌ను సందర్శించింది. కలకత్తా, హైదరాబాద్, కాలికట్, కన్నూరులో పర్యటించింది. ‘ప్రతిసారీ భారత్ పర్యటన కొత్తగానే ఉంటుంది’ అని చెప్పింది అలైడా.