దేవుడి ముసుగులో రాజకీయ రాద్ధాంతం

దేవుడి ముసుగులో రాజకీయాలు చేయడం బీజేపీకి పరిపాటిగా మారింది. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. శోభాయాత్రకు స్వాగతం పలికే వేదికలను సైతం తమ రాజకీయల కోసం వాడుకొన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను హైదరాబాద్‌కు రప్పించి, నిమజ్జనం రోజు రాజకీయం చేయాలని కుట్రపన్నారు. వారి కుట్రలను సామాన్య భక్తులు భగ్నంచేశారు. ధర్మ కార్యానికి వచ్చి.. రాజకీయం చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ తరుణంలోనే మోజంజాహి మార్కెట్‌ వద్ద స్థానికులు, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు బీజేపీ కుట్రలను తిప్పికొట్టారు.

చార్మినార్‌ వద్ద శుక్రవారం ఏర్పాటుచేసిన వేదికపై మాట్లాడేందుకు అస్సాం సీఎం ప్రయత్నించగా, పోలీసులు వారించారు. తన కాన్వాయ్‌లో నుంచి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై పిచ్చికూతలు కూశారు. దీంతో శోభాయాత్రలో ఉన్నవారు కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. దేవుడి కార్యం కోసం వచ్చి రాజకీయాలు మాట్లాడటమేమిటని ఆగ్రహించారు. అక్కడి నుంచి మోజంజాహి మార్కెట్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికకు హిమంత బిశ్వ చేరుకున్నారు. అప్పటికే భాగ్యనగర గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి, బీజేపీ నాయకుడు భగవంతరావు మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీంతో కింద నుంచి సామాన్య ప్రజలు అభ్యంతరం వ్యక్తంచేశారు.

ఇంతలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నందకిశోర్‌ వ్యాస్‌ వేదికపైకి వెళ్లి భగవంతరావు ముందున్న మైక్‌ను లాగేశారు. పక్కనే ఉన్న అస్సాం సీఎంను నిలదీశారు. ‘నీవు వచ్చిన పనేంటి.. ధర్మ వేదికపై ఉండి.. హిందు ధర్మం కోసం.. భక్తితో వచ్చిన వాడివి భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజలు చేసి వెళ్లు.. నీ రాజకీయాల కోసం ఈ ధర్మ వేదికను వాడుకుంటావా? మేం కూడా కరుడుగట్టిన హిందువులమే.. మా రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తావా? అలా చేస్తే మేం ఉరుకుంటామా?’ అంటూ కడిగిపారేశారు. దీంతో నందకిశోర్‌ను వేదికపై ఉన్నవారితోపాటు హిమంత బిశ్వ శర్మ సెక్యూరిటీ కిందకు పంపించారు. కింద ఉన్న నగర పోలీసు బృందాలు వెంటనే నందకిశోర్‌ను అబి డ్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేజీ కింద ఉన్న సామాన్య ప్రజలు నందకిశోర్‌ మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది.. దేవుడి కార్యంలో రాజకీయం ఏంటంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొనగా, పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.

error: