ప్రభుత్వరంగ బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐఏసీఎల్) 685 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 25 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డిగ్రీ ఉత్తీర్ణులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడగలగడం తప్పనిసరి. స్థానిక భాషలు వచ్చినవారు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల వయసు జూన్ 30, 2018 నాటికి 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 1, 1988 కంటే ముందు; జూన్ 30, 1997 తర్వాత జన్మించినవాళ్లు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఆబ్జెక్టివ్ ప్రిలిమినరీ పరీక్ష, ఆబ్జెక్టివ్ మెయిన్స్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే.. తుది ఎంపిక జరిగేముందు అభ్యర్థి ప్రాంతీయ భాషా ప్రావీణ్య పరీక్షలో (రీజనల్ లాంగ్వేజీ ప్రొఫిషియన్సీ టెస్ట్) ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. భాషా ప్రావీణ్యానికి మార్కులు ఉండవు.
వంద మార్కులకు ప్రిలిమినరీ
వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిస్ లాంగ్వేజ్ నుంచి 30, రీజనింగ్ 35, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. ఒక్కో విభాగానికీ 20 నిమిషాల చొప్పున కేటాయించారు ప్రతి సెక్షన్‌లోనూ కటాఫ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలకు సంబంధించి..కేటగిరీలవారీ అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
అయిదు విభాగాల్లో మెయిన్స్ మొత్తం 250 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున అయిదు విభాగాల్లో (ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్) కలిపి 200 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒకటింపావు మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావుశాతం చొప్పున తగ్గిస్తారు.
తుది నియామకాలు
ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ (ఆయా రాష్ట్రాలు, విభాగాల వారీ) ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు. విధుల్లో చేరినవారికి రూ.14435- 40080 మూలవేతనం లభిస్తుంది. ప్రారంభంలో రూ.23,500 వేతనం అందుకోవచ్చు. ఎంపికైనవారికి 6 నెలలపాటు ప్రొబేషన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జులై 31
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. వంద. మిగిలిన అందరికీ రూ. 600
టైర్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ: సెప్టెంబరు 8, 9
టైర్-2 మెయిన్ పరీక్ష తేదీ: అక్టోబరు 6
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం. తెలంగాణలో: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.