రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఒక వర్గానికి చెందిన ప్రజలు మంగళవారం అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు ఆగ్రహంతో దాడులకు దిగారు. ఈ ఘటనలతో పలు వాహనాలు దెబ్బ తిన్నాయి. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని వర్గాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. చంచల్‌గూడ, అలియాబాద్, సయ్యద్ అలీ చబుత్రా, చార్మినార్, లాడ్‌బజార్, మీర్‌చౌక్, దారుల్ షిఫా, గుల్జార్ హౌస్ ప్రాంతాల్లో ఒక వర్గపు యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తంచేశారు. మొఘల్‌పుర ప్రాంతం లో చేపట్టిన నిరసనల్లో నిరసనకారులు పోలీస్ వాహనంపై రాళ్లతో దాడులు చేశారు.
అలియాబాద్ క్రాస్ రోడ్డులో చేపట్టిన ర్యాలీలో నిరసనకారులు రాళ్లు రువ్వడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. నిరసన కారులను గుర్తించిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని శాలిబండ పోలీస్టేషన్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్లు స్టేషన్‌లలోనే ఉండి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకొంటున్నారు. దక్షిణ మండల డీసీపీ, అదనపు డీసీ పీ, ఎస్బీ అడిషనల్ డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులు అదుపు తప్పకుండా చర్యలు తీసుకొంటున్నారు. అయినప్పటికీ.. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో పాతబస్తీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
