పుట్టమధు మిస్సింగ్ ?

పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు ఐదు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే ఆయన అదృశ్యం కావడం పెద్దపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈటలకు సన్నిహితుడిగా పేరున్న పుట్ట మధు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకొని ఎందుకు కనిపించకుండా పోయారనేది హాట్‌ టాపిక్‌ అయింది.
ఈటల ఎపిసోడ్‌ వెలుగులోకి రాకముందే.. అడ్వకేట్‌ దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని, హత్య కోసం రూ.2 కోట్ల సుపారీ ఇచ్చారనే పుకార్లు షికారు చేశాయి. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అదే సమయంలో ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ తెరపైకి రాగా.. అనూహ్యంగా మధు అదృశ్యమయ్యారు. ఐదు రోజులుగా ఆయన ఫోన్‌లోనూ అందుబాటులో లేరు.

ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకొని అదృశ్యం అయిన పుట్ట మధు వెంట రక్షణ కోసం నలుగురు గన్‌మెన్లు ఉంటారు. మంథని నుంచి గన్‌మెన్లకు కూడా చెప్పకుండా మధు అదృశ్యం అయినట్లు మంథనిలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయాన్ని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ ధ్రువీకరించలేదు.
‘జెడ్‌పీ చైర్మన్‌ మధు వెంటే గన్‌మెన్లు ఉన్నారు. మధు అదృశ్యమైనట్లు గన్‌మెన్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా ఫిర్యాదు రాలేదు’ అని ‘సాక్షి’కి తెలిపారు. గన్‌మెన్ల ఫోన్‌లు పనిచేస్తున్నాయని మాత్రం చెప్పిన సీపీ మధు ఎక్కడున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ‘ప్రజాప్రతినిధులు పనుల మీద దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. వారితోపాటు వారి రక్షణ కోసం గన్‌మెన్లు కూడా వెళతారు. ఆ వివరాలేవీ గన్‌మెన్లు మాకు రిపోర్టు చేయరు’ అని సీపీ సత్యనారాయణ వివరించారు.

వామన్‌రావు దంపతుల హత్య వ్యక్తిగత కక్షలతో జరిగిందే తప్ప రాజకీయ కోణంలో కాదని, తమ పార్టీ వారికి హత్యతో ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. కేసులో దోషులను కూడా అరెస్టు చేసిన విషయాన్ని వెల్లడించారు. అయితే.. పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను ఈ హత్యకేసులో నిందితుడు కావడంతో మంథనిలో పుకార్లు ఆగలేదు. తాజాగా వామన్‌రావు హత్యకు రూ.2 కోట్ల సుపారీ అందించారని, ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఒకరిద్దరిని అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. నిందితుల్లో ఒకరు అప్రూవల్‌గా మారారని.. చాలా విషయాలు వెల్లడించారని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మధు కనిపించకుండా పోవడం చర్చనీయాంశమైంది.

error: