పొంచి ఉన్న మరో ద్రోహం!

ఏపీ విభజన అశాస్త్రీయమంటూ టీడీపీ ఎంపీలు చేసిన వాదనలను కాంగ్రెస్ ఎందుకు ఖండించలేదు? తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు బేషరతుగా ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్.. తెలంగాణకు రక్షణలు ఎందుకు ప్రతిపాదించలేదు? దీనిపై మాట్లాడటానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు జంకుతున్నారు? విభజన బిల్లులో ఉభయ రాష్ర్టాలకు 95(1) ప్రకారం పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్నురాయితీ కల్పించాలన్న విషయాన్ని కాంగ్రెస్ ఎందుకు విస్మరిస్తున్నది? బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయడం లేదు? ఏపీ, తెలంగాణలో టీడీపీతో పొత్తులకు వాతావరణాన్ని సిద్ధంచేసుకుంటున్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సంకేతమేమిటి?

అధికార దాహం, అంతులేని ద్రోహం అనే మాటలు కాంగ్రెస్ పార్టీకి అక్షరాలా అతికినట్టు సరిపోతాయి. కాంగ్రెస్ కపట రాజకీయ ఖడ్గాన్ని ఝళిపిస్తుంటే తెలంగాణ మళ్లీమళ్లీ బలవుతున్నది. తెలంగాణకు జరిగిన ద్రోహాల చరిత్రను ఏకరువుపెడితే అది కాంగ్రెస్ చరిత్ర అవుతుంది.తెలంగాణకు ఎన్నిసార్లు ద్రోహంచేసినా, కాంగ్రెస్‌కు కడుపునిండదు. ఆ పార్టీది మేకలను తినే తోడేలు ఆకలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం అడ్డంపెట్టుకొని కాంగ్రెస్‌పార్టీ మరో క్షుద్రరాజకీయానికి తెరలేపింది. కేవలం రాబోయే ఎన్నికల్లో టీడీపీతో అవకాశవాద పొత్తు పెట్టుకునేందుకు మార్గం సుగమం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా పావులు కదుపుతున్నది. బీజేపీపై అవిశ్వాసం తీర్మానం సందర్భంలో టీడీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ విభజన అప్రజాస్వామికంగా జరిగిందని, అశాస్త్రీయమని అవాకులు చెవాకులు పేలినారు. వారి విమర్శలన్నీ కాంగ్రెస్ పార్టీకి వర్తించేవే. కాంగ్రెస్ పార్టీ వాటిని తిప్పికొట్టవల్సిందిపోయి వత్తాసుపలికింది. ఇంతకన్నా దివాళాకోరుతనం, అత్మహత్యా సదృశ వైఖరి వేరే ఉంటాయా? పార్లమెంట్‌లో టీడీపీ తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను ఎండగట్టింది ఒక్క టీఆర్‌ఎస్ పార్టీనే.
ఆరు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్‌లో ముచ్చటగా ముగ్గురు తెలంగాణ బిడ్డలను కూడా మూడుకాలాలపాటు గద్దెమీద కూర్చోనివ్వలేదు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేండ్లు నల్లేరు మీద బండి నడక వలె నడిపించిన అపర చాణక్యుడు పీవీ నరసింహరావును, ఆరు నెలలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిలబడనివ్వలేదు. చీమకు కూడా అపకారం చేయనివ్వని టంగుటూరి అంజయ్య వంటి శ్రమజీవిని, మానవతావాదిని జోకర్‌గా చిత్రించి, అవమానించి, పదవి నుంచి దించిన నీచత్వం కాంగ్రెస్ సొంతం. చెన్నారెడ్డి వంటి సమర్థుణ్ని కూడా అసహాయుణ్ణి చేసి చరిత్రలో ద్రోహిగా ముద్రపడేటట్టు చేసిన సిసలైన తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ పార్టీ.

కాకకాక ఒక తెలంగాణవాడు, తెలుగువాడు పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయితే ఢిల్లీలో ఆయనకు తలకొరివి పెట్టేందుకు కూడా జానెడు జాగ ఇయ్యక కాంగ్రెస్ తన కుత్సితత్వాన్ని బయటపెట్టుకున్నది. పీవీకి జరిగిన అవమానాన్ని తలుచుకున్నప్పుడల్లా చివరి మొగల్ చక్రవర్తి అయిన బహదూర్ షా జఫర్ బ్రిటిష్ వాళ్ల చేతుల్లో రంగూన్ జైలులో బందీ అయి తన అంతిమ ఘడియలు సమీపిస్తున్నప్పుడు రాసుకున్న కవిత యాదికొస్తది. కిత్నాహై బద్ నసీబ్ జఫర్, దఫ్న్ కేలియే దో గజ్ జమీన్ భీ న మిలీ కుయే యార్ మే (నీవు ఎంత దురదృష్టవంతుడివి జఫర్.. నీకు ప్రియమైన ప్రదేశం (ఢిల్లీ)లో నిన్ను సమాధి చేసేందుకు రెండు గజాల నేల కూడా నీకు దొరుకలేదు) పీవీకి జరిగిన అవమానానికి ఈ కవితా వాక్యాలు సరిగ్గా సరిపోతాయి.

గాంధీతత్వానికి తిలోదకాలిచ్చి బ్రిటిష్ వలసవాదతత్వాన్ని వారసత్వంగా పుణికిపుచ్చుకున్నది కాంగ్రెస్. సత్యాన్ని వధిస్తూ.. ధర్మాన్ని చెరబడుతూ.. ప్రజాస్వామ్యం వలువలు ఊడుస్తూ కాంగ్రెస్ చెలరేగుతున్నది. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని గద్దెనెక్కిన తర్వాత తెలంగాణ ప్రజలను దారుణంగా వంచించలేదా? టీఆర్‌ఎస్‌ను మింగేసి ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నించలేదా? తెలంగాణ సమాజాన్ని, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ ఎన్నిరకాల చిత్రహింసలకు గురిచేసింది! చివరికి కేసీఆర్ నిరాహార దీక్ష ప్రభావానికి జడిసి డిసెంబర్ 9 ప్రకటన చేసింది. చేసినట్టే చేసి వెనుకకుపోయి వందలమంది యువకుల బలిదానాలకు కారణమయ్యింది. చివరికి రాజకీయ అనివార్యత ఏర్పడితేనే తెలంగాణ ఏర్పాటుకు పూనుకొన్నది. కాంగ్రెస్ ధృతరాష్ట్ర కౌగిలిలో తెలంగాణ ఇంకా నలిగిపోతూనే ఉన్నది. కాంగ్రెస్ అరువై ఏండ్ల పాలనలో తెలంగాణ నుంచి నదులు, నిధులు, ఖనిజ సంపద, అటవీ సంపద, కరంటు, కొలువులు అన్నీ ఆంధ్రకు తరలిపోయినాయి.

ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సమావేశం తీరుతెన్నులు చూస్తే అది తెలంగాణ వ్యతిరేక కూటమి సమావేశంగా స్పష్టమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బేషరతుగా ఇవ్వాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా కమిటీ ఆమోదించింది. బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి వెనుకబడిన రాష్ర్టాలకు కూడా ప్రత్యేక హోదా అడుగాలని ఒడిశా పీసీసీ అధ్యక్షుడు పట్టుబడితే అందరూ కలిసి గద్దించి కర్కశంగా ఆయన నోరు మూయించారు. వర్కింగ్ కమిటీలో ఒక్క తెలంగాణ నేతకు కూడా ప్రాతినిధ్యం కల్పించలేదు. ఆంధ్రప్రదేశ్‌కు హోదా కల్పించే నేపథ్యంలో తెలంగాణకు ఎటువంటి రక్షణలు ప్రతిపాదించలేదు. దీనిపై కనీసం గుసగుసలుగానైనా నిరసన చెప్పడానికి కూడా ఏ ఒక్క తెలంగాణ కాంగ్రెస్ నాయకునికి ధైర్యం చాల్లేదు. పైపెచ్చు ఆంధ్రకు హోదా ఇస్తే తెలంగాణకు ఏమి నష్టం? అని ఒక నాయకుడు అతి తెలివి ప్రశ్నలు వేస్తున్నాడు.

ఫార్మా ఇండస్ట్రియల్ హబ్‌గా హైదరాబాద్‌కు గుర్తింపు ఉంది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు ప్రత్యేకహోదా రీత్యా లభిస్తున్న ప్రోత్సాహకాల నేపథ్యంలో ఫార్మారంగంలో ఇక్కడివాళ్లు ఆ రాష్ర్టాలలో పరిశ్రమలు స్థాపించారు. అటువంటిది పొరుగు రాష్ర్టానికి ప్రత్యేక హోదా వస్తే.. ప్రభావ తీవ్రత ఎంత పెరుగుతుందో అంచనా వేసుకోవచ్చు. అట్లని.. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వవద్దని చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో ఉభయ రాష్ర్టాలకు 95 (1) ప్రకారం పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్నురాయితీ కల్పించాలని ఉంది. ఆ నిబంధనలు అమలుచేయడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడాలనేది తెలంగాణ ప్రజల డిమాండ్.

ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడిగినప్పుడు అక్కడి పార్టీ అక్కడి ప్రజల ప్రయోజనాలను డిమాండ్ చేయడం సహజమేనని భావించాం, మద్దతిచ్చాం. అది మా విజ్ఞతకు, సౌహార్ద్రతకు నిదర్శనం. కానీ.. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ ఢిల్లీ నుంచి ప్రత్యేక హోదా గురించి ఏకపక్షంగా మాట్లాడినప్పడు మాత్రం ప్రశ్నించకుండా ఉండలేం. పైగా కేవలం రాజకీయ లబ్ధి కోసం, టీడీపీతో అవకాశవాద పొత్తు కోసం మాట్లాడినప్పుడు మిన్నకుంటే నేరమవుతుంది కూడా.
చరిత్ర మలుపులో తెలంగాణకు మరో చారిత్రక ద్రోహం పొంచి ఉన్నది. హస్తినలో ధృతరాష్ర్టుని నుంచి మోదీ దాకా ఒకే రకమైన పాలన సాగుతున్నట్టు అనిపిస్తున్నది. తెలంగాణలో 80 శాతం పారే గోదావరి మీద శాశ్వతంగా గుత్తాధిపత్యాన్ని దఖలుచేసేందుకు పోలవరం కుట్రకు నారుపోసింది కాంగ్రెస్ అయితే.. ఇప్పుడు నీరు పోస్తున్నది బీజేపీ. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసింది. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ హామీ నెరవేరలేదు. ట్రైబల్ యూనివర్సిటీ అతీగతీలేదు. ఐటీఐఆర్ ఊసే మరిచారు.

కాళేశ్వరం లేదా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులలో ఒక్కదానికైనా జాతీయహోదా ఇవ్వాలని టీఆర్‌ఎస్ డిమాండ్‌చేస్తూంటే మోదీ ప్రభుత్వం సాచివేత ధోరణిని అవలంబిస్తున్నది. ఎయిమ్స్ మంజూరైతే చేశారు. కానీ.. ఒక్కపైసా ఇచ్చిన పాపానపోలేదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి బృహత్తర కార్యక్రమాలకు నిధులివ్వాలని అడుగుతుంటే చలనం లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై స్పందన లేదు. హైకోర్టు విభజన చేయకపోవడం వల్ల తెలంగాణకు అన్యాయం కొనసాగుతూనే ఉన్నది. తెలంగాణకు శుష్కప్రియాలు, శూన్యహస్తాలతో మోదీ ప్రభుత్వం పొద్దుపుచ్చుతున్నది.టీడీపీతో కాంగ్రెస్ జతకట్టడం అంటే తెలంగాణ వ్యతిరేకులతో చేయి కలుపడమే. రేపు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో పొత్తులు పెట్టుకునేందుకు కావలిసిన వాతావరణం ఇద్దరూ సిద్ధం చేసుకుంటున్నారు.

దీనిద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సంకేతం ఏమిటి? రేపు తాము అధికారంలోకి వస్తే టీడీపీ కోరుతున్నట్టు తెలంగాణ ప్రయోజనాలకు గండికొడతామనే కదా? గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణకు దక్కకుండా ఉండేలా టీడీపీ సాగిస్తున్న కుట్రలకు మద్దతు ఇస్తామనేకదా? చంద్రబాబు పెత్తనాన్ని, తద్వారా ఆంధ్ర అధిపత్యాన్ని తిరిగి తెలంగాణ మీద రుద్దుతామనేకదా? ఆంధ్రపాలకవర్గం దోపిడీ ప్రయోజనాలను మళ్లీ నెరవేరుస్తామనే కదా? తెలంగాణలో మొదలైన అభివృద్ధి క్రమాన్ని పూర్తిగా నిరోధిస్తామనే కదా? స్వపరిపాలనకు చేటు తెస్తామనే కదా? కాంగ్రెస్ తెలుగుదేశం జమిలిగా చేయబోతున్న ఈ చారిత్రక ద్రోహన్ని తెలంగాణ ప్రజలు ఎంతమాత్రం అనుమతించరు. అరవై ఏండ్ల ఉద్యమఫలాన్ని వీళ్ల రాజకీయ నీచత్వం కోసం బలిపెట్టరు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ చేసిన ప్రజాపోరాటం, అమరుల బలిదానాల ఫలితంగా సాధించుకున్న స్వరాష్ర్టానికి, స్వపరిపాలనకు విఘాతం తెచ్చుకోరు. ఈ రెండు పార్టీలకు ప్రజలు తప్పకుండా బుద్ధిచెప్తారు. తెలంగాణను కంటికి రెప్పవలె కాపాడుకుంటారు.

విభజనవల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం జరిగిందని, అభివృద్ధిలో వెనుకబడిపోతున్నదని ఆంధ్రానాయకుల వాదన. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విధ్వంసంవల్ల, దోపిడీవల్ల, వనరుల తరలింపువల్ల, వివక్ష, అణిచివేతలవల్ల తెలంగాణ తీవ్ర వెనుకబాటుతనానికి గురైంది. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా 1956లో ఆంధ్రలో కలిపిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. తెలంగాణకు ఇచ్చిన హామీలు, రక్షణలు, ఫార్ములాలు, సూత్రాలు, ఎన్నికల వాగ్దానాలు, పార్లమెంట్ ప్రకటనలు, చట్టాలు, జీవోలు, రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కి, గంగలో కలిపింది కాంగ్రెస్. ఇచ్చిన హామీలు అమలుచేయాలని కోరిన పాపానికి తుపాకులు ఎక్కుపెట్టి 369 మంది నవ యువకులను పొట్టన పెట్టుకున్నది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నైసర్గికంగా పక్కపక్కనే ఉన్న రాష్ర్టాలు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే పరిశ్రమలకు పన్నుల నుంచి పూర్తి మినహాయింపుతోపాటు సులువుగా రుణాలు, మౌలిక వసతులు, అనుమతులు తదితర ప్రోత్సాహకాలు లభిస్తాయి. భౌగోళిక సామీప్యం రీత్యా తెలంగాణలో ఉన్న పరిశ్రమలు కొంతమేరకు తరలిపోతాయి. దీంతో తెలంగాణలో పన్నురాబడి తగ్గిపోతుంది. ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది. హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేకతల రీత్యా పరిశ్రమలు పూర్తిగా తరలిపోకపోవచ్చు. కానీ.. కొత్తవి రాకుండా పోయే ప్రమాదం మాత్రం మెండుగా ఉంటుంది. ఉదాహరణకు వెయ్యి కోట్ల రాబడి ఉన్న పరిశ్రమ హైదరాబాద్‌లో ఉంటే రూ.200 కోట్లు పన్నుల రూపంలో చెల్లిస్తుంది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్‌కు ఐదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తే వెయ్యి కోట్లు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రయోజనం వదులుకొని ఏ కంపెనీ అయినా అమరావతికి పోకుండా ఉంటుందా? ఆకలిగొన్నవాడికి ఎదురుగా షడ్రసోపేతమైన భోజనం కనిపిస్తే నోరూరకుండా ఉంటదా? తినకుండా ఉంటడా?

తెలంగాణ ఆవిర్భావం తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలో ఇన్నేండ్లుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పనిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తలమునకలైంది. అభివృద్ధి, సంక్షేమంవైపు తదేక దృష్టి సారించింది. రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలను తగ్గించడంకోసం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా పోరాటానికి టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. ఇస్తుంది కూడా. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినప్పుడు ఆ ప్రభావం తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా, తగిన రక్షణాత్మక చర్యలు కూడా ప్రతిపాదించడం న్యాయం. జాతీయ పార్టీగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అటువంటి విజ్ఞతను చూపాలె. కానీ అలా చేయలేదు. కనీసం విభజన బిల్లులో ఉన్న 95(1) ప్రకారం తెలంగాణకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్నుల రాయితీ అనే అంశాన్ని ప్రస్తావించలేదు. బంతిలో భోజనం చేస్తున్నప్పుడు పక్కవాడికి పరమాన్నం వడ్డించి తనకు కనీసం పప్పన్నం అయినా పెట్టకపోతే ఎవరికైనా బాధ కలుగుతుంది. అందులోనూ పౌష్టికాహారం లేక బక్కచిక్కి ఆకలితో ఉన్నవాడికి మరింత బాధ కలుగుతుంది. సమానధర్మం కావాలని ఆశించడం సహజం. ఆంధ్రకు హోదా తప్పకుండా ఇవ్వండి. కానీ.. మా పొట్ట మాడకుండా ఉండేందుకు తెలంగాణలో పరిశ్రమలకు పన్ను రాయితీ ఇవ్వండి అన్నదే ఇవ్వాళ తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అహరహం పరిశ్రమిస్తూ నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అడ్డగోలుగా కేసులు వేస్తున్నారు. స్థానిక బీజేపీ నాయకత్వం కేంద్రనాయకత్వం మీద ఒత్తిడి పెంచి విభజన హామీలు నెరవేర్చేవిధంగా చేయవలిసిందిపోయి టీఆర్‌ఎస్ మీద విమర్శలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నది. తెలంగాణలో ఇంకా ఆంధ్ర వలసవాద అవశేషాల వలె మిగిలి ఉన్న కొద్దిమంది టీడీపీ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తమ పార్టీ తెలంగాణ పట్ల తన వ్యతిరేక వైఖరిని నగ్నంగా బయటపెట్టుకుంటున్నా, ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతూ ఆత్మవంచనకు, పరవంచనకు పాల్పడుతున్నారు. వీళ్ల ద్రోహానికి నిష్కృతి లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చంద్రబాబు తన పూర్తి శక్తిని వినియోగిస్తూ తెలంగాణ రాష్ర్టానికి వ్యతిరేకంగా మోహరించినాడని స్వయంగా ప్రధాని మోదీ పార్లమెంట్ వేదిక నుంచి ప్రకటించిన తర్వాతనైనా సిగ్గు తెచ్చుకొని ఆ పార్టీని వదిలేయాల్సిందిపోయి నిర్లజ్జగా ఇంకా అదే చూరుకు వేళ్లాడుతున్నారు.
– తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి

error: