ప్రతి మనిషికి గురువే దైవం

గురు దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని దేశాల్లో సెలవులు కూడా ఇస్తారు. ఈ క్రమంలో భారత్‌లో సైతం గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. భారత రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీన మన దేశంలో టీచర్స్‌డే నిర్వహిస్తూ వస్తున్నారు. 1962లో భారత రెండో రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ పదవీబాధ్యతలు స్వీకరించారు. పుట్టిన రోజును జరిపేందుకు అనుమతివ్వాలని కోరుతూ రాధాకృష్ణన్‌ను కొందరు కోరారు. అందుకు ఆయన స్పందించారు. తన పుట్టిన రోజును ప్రత్యేకంగా జరిపేకంటే, సెప్టెంబర్5న టీచర్స్ డే నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. దీంతో ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న టీచర్స్‌డే నిర్వహిస్తున్నారు.

భారతీయ సంస్కృతీ సంప్రదాయంలో గురువుకు, గురు సంప్రదాయానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న ది. గురువంటే సాక్షాత్ ఈశ్వరుడే, పరబ్రహ్మ స్వరూపుడే. అందుకే ‘‘గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమః’’ అన్నారు.
‘‘అప్రత్యక్షో మహాదేవః సర్వేషామాత్మ మాయయా
ప్రత్యక్షో గురు రూపేణ వర్తతే భక్తి సిద్ధయే’’
పరమాత్మయే జీవులను ఉద్ధరించటానికి సద్గురువు రూపంలో అవతరిస్తాడన్నది భారతీయ తత్త్వం.
అందుకే, ‘‘గురుర్ గురుతమో ధామః సత్యః సత్య పరాక్రమః’’ అన్నది విష్ణు సహస్రనామం.

తల్లి జన్మనిస్తుంది. తండ్రి ఆలనా పాలనా చూస్తాడు. కానీ విజ్ఞానపరంగా జన్మనిచ్చేది మాత్రం గురువే. తన మేధస్సును మన మనస్సులోకి చొప్పించి… ఓ అద్భుతమైన శక్తిగా మలుస్తాడు. సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెడతాడు గురువు. గురువును దైవంతో సమానంగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో  పోల్చుతారు. అంతే గొప్పగా పూజిస్తారు. నాటి పురాణాల నుంచి నేటి వరకు విద్యావ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా.. గురువుకున్న స్థానం ఈ సృష్టి ఉన్నన్ని రోజులుగా అలాగే ఉంటుంది. మనిషి ఖ్యాతి ఖండాంతరాలు దాటుతోంది. కానీ.. దానికి తొలి అడుగు పడేది మాత్రం గురువు అడుగుజాడల్లోనే. విద్యార్థికి  పసి వయసు నుంచే విద్యాబుద్ధులు నేర్పిస్తారు ఉపాధ్యాయుడు. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేది కూడా ఆయనే. విద్యలేని వాడు వింత పశువు అన్నారు పెద్దలు. మానవ జీవితానికి మార్గదర్శనం చేసేది గురువే. చిన్నతనంలో వేలుపట్టి గురువు దిద్దించిన అక్షరాలే.. భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. జీవితంలో సాధించే ఎన్నో గొప్ప విజయాలకు ఆ ఓనమాలే తొలి మెట్లు.

error: