ఫైనల్‌ ఫోబియా లేదు

తనకు ఫైనల్‌ ఫోబియా లేదని భారత స్టార్‌ షట్లర్‌ పూసర్ల వెంకట సింధు తెలిపింది. ఆరంభ రౌండ్లలో ఓడటం కంటే ఫైనల్‌ చేరడం గొప్ప విషయమేనని చెప్పింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించి మంగళవారం హైదరాబాద్‌ తిరిగొచ్చిన సింధు.. విలేకరులతో మాట్లాడుతూ ‘‘జీవితంలో కొన్ని రోజులు మనకు కలిసిరావు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కరోలినా మారీన్‌తో పోరు కూడా అంతే. ఐతే ఫైనల్‌ చేరుకోవడం చిన్న విషయం కాదు. అక్కడి దాకా వెళ్లడం అంత సులువు కాదు. ఎంతోమంది ఫైనల్‌కు రాకుండానే ఓడిపోతున్నారు.

మారీన్‌ దూకుడైన క్రీడాకారిణి. కోర్టులో చాలా వేగంగా కదులుతుంది. ఆమె ఆటతీరు, శైలి అంతే. ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసే వ్యూహమది. ఫైనల్లో నేను సిద్ధంగా లేకపోయినా షటిల్‌ సర్వ్‌ చేసింది. త్వరగానే సర్వ్‌ చేయడంపై అంపైర్‌ కూడా ఆమెను మందలించాడు. ఐతే నా ఓటమికి అది కారణమని చెప్పను. తొలి గేమ్‌ ద్వితీయార్ధంలో కీలక సమయంలో కొన్ని పొరపాట్లు చేశా. ఆ పాయింట్లు నేను గెల్చుంటే ఫలితం మరోలా ఉండేది.

మ్యాచ్‌ తర్వాత నన్ను ఆలింగనం చేసుకోవడం మారీన్‌ గొప్ప మనసుకు నిదర్శనం. మారీన్‌, నేను మంచి స్నేహితులం. ఐతే కోర్టులో అడుగుపెడితే మేమిద్దరం ప్రత్యర్థులమే. ఆటపైనే మా దృష్టంతా. ప్రపంచ ఛాంపియన్‌ అవ్వాలంటే మరింత కష్టపడాలి. వచ్చే ఏడాది తప్పకుండా స్వర్ణం గెలుస్తా. ఈసారి కూడా పూర్తి సన్నద్ధతతోనే ప్రపంచ టోర్నీకి వెళ్లా. ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ప్రతి ఒక్కరూ సంసిద్ధులై వస్తారు. ఏదో ఒకరోజు తప్పకుండా స్వర్ణం సాధిస్తా’’నని తెలిపింది.

error: