బహుముఖ మౌనం
నిశ్శబ్దం యుద్దానికి సంకేతమేమో
ఎవరికి కనబడకుండా
కొట్లాట జరుగుతున్నదని
తెలియకుండానే
తుఫానులా
బీభత్సం సృష్టించవచ్చు…
మౌనం మరో పోరాట రూపమేమో
పక్కోడికి అంతుబట్టకుండా
దూరంగా జరుగుతూ
సునామీలా దగ్గరై
నిన్ను నన్ను ముంచేస్తూ
తీరని వేదన మిగల్చవచ్చు…
ముభావంగా ఉన్నామంటే
అన్ని సమయాల్లో
సహకారం అందిస్తామని అర్థం కాకపోవచ్చు
సహించలేని వ్యతిరేకత కూడా కావచ్చు…
మౌన తపస్సు
ప్రేమాభిమానాల తీగలను
అల్లుతుంది
దూరాల గాయాలను
రగిలిస్తుంది…
మౌన రాగాలు
ఆనందాల హరివల్లును
పేర్చుతయి
వెలిగే నక్షత్రాలను
రాల్చతయి…
మౌనాగ్న
దుఃఖ లవాను వేదజల్లుతుంది
మనిషిని శిలాజం చేస్తుంది…
మౌనంగా ఉన్నానంటే
నిన్ను మరిచినట్టు గాదు
నిన్ను ఎక్కువగా
గుర్తుకు చేసుకుంన్నానని అర్థం…
(విలాసాగరం రవీందర్ గారి నది పలికిన వాక్యం నుండి )