భారత్‌లో ఏటా 11 లక్షల మంది కన్నుమూత

భారత్‌లో శిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని సగానికిపైగా జిల్లాలు నవజాత శిశువులు, ఐదేండ్ల లోపు చిన్నారుల మరణాలను తగ్గించడంలో ఇంకా అట్టడుగునే ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 2030 నాటికి శిశుమరణాల్ని సగానికిపైగా తగ్గించాంటూ నిర్దేశించిన లక్ష్యం ఈ మేరకు నీరుగారుతున్నదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఐప్లెడ్ సిస్టమ్స్ అనాలిసిస్‌కు చెందిన జయంత్ బోరా, నందిత సైకియా ఈ అధ్యయనాన్ని చేపట్టారు. నవజాత శిశువులు, ఐదేండ్లలోపు చిన్నారుల అకాల మరణాలపై భారత్‌లో జిల్లాల వ్యాప్తంగా సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి వాటిని ప్రచురించారు. ఇందుకోసం 2015-16లో కేంద్రం చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) గణాంకాలను ప్రామాణికంగా తీసుకున్నారు.ఆ వివరాలివి..
-చిన్నారుల మరణాల విషయంలో భారత్ ఇప్పటికీ ప్రపంచంలో తొలి వరుసలోనే ఉంది.

ప్రతి ఏటా సుమారు 11 లక్షల మంది చిన్నారులు భారత్‌లో కన్నుమూస్తున్నారు.
-ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 2030 నాటికి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-3 (ఎస్‌డీజీ-3) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నవజాత శిశుమరణాల్ని ప్రతి 1000 జననాలకు 12కు, అలాగే ఐదేండ్ల లోపు చిన్నారుల మరణాలను ప్రతి 1000 జననాలకు 25కు తగ్గించాలని నిర్దేశించారు. కానీ, భారత్‌లో ఆ దిశగా పూర్తిగా చర్యలు తీసుకోలేదు.
-గత 23 ఏండ్లలో భారత్‌లో ఐదేండ్లలోపు చిన్నారుల మరణాలు సగానికిపైగా తగ్గాయి. 1990లో ప్రతి 1000 జననాలకు 109 మంది చిన్నారులు కన్నుమూయగా, 2013 నాటికి వీరి సంఖ్య సుమారు 50కి తగ్గింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లక్ష్యానికి కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ.

error: