మెదక్ లో యువతుల విక్రయం

మెదక్/నారాయణఖేడ్‌: మండల పరిధి కొండాపూర్‌లోని హనుమాన్‌ తండాలో పలువురు యువతులను విక్రయిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై శుక్రవారం నారాయణఖేడ్‌ ఆర్డీవో అంబాదాస్‌ రాజేశ్వర్‌, డీఎస్పీ సత్యనారాయణరాజు, తహసీల్దార్‌ రహేమాన్‌, ఎస్‌ఐ సందీప్‌ తదితరులు విచారణ చేపట్టారు. ఈ తండాకు చెందిన ఇద్దరు అమ్మాయిలను రాజస్థాన్‌వ్యక్తులకు ఇచ్చి గతంలో వివాహం చేశారు. దీంతో ఆ అమ్మాయిలను విక్రయించారని కొందరు ఆరోపణలు చేయడంతో అధికారులు యువతుల తల్లిదండ్రులను విచారించగా తాము విక్రయించలేదని, వారి ఇష్టంతోనే హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసి, ధ్రువపత్రాలు కూడా తీసుకున్నామని వాటిని చూపించారు. అమ్మాయిలు అక్కడ బాగానే ఉన్నారని, తరుచూ అమ్మాయితో పాటు భర్త, అత్తమామలతో మాట్లాడుతున్నామని తెలిపారు. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ, తమ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాజస్థాన్‌లో ఉన్న అమ్మాయిలతో వాట్సాప్‌ ద్వారా మాట్లాడించగా, వారు కూడా ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నామని, తమను ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని వాపోయారు. తప్పుడు ఆరోపణలతో తమ పరువు తీస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. దీంతో అమ్మాయిలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా… గత నెల మొదటి వారంలో రాజస్థాన్‌కు చెందిన కొందరు నారాయణఖేడ్‌కు వచ్చి లాడ్జీలో ఉండడంతో అప్పట్లో వారిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే.

error: