సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్

పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తరలింపు ప్రారంభమైంది. మొదటి డోసుతో మూడు ట్రక్కులు పుణెలోని విమానాశ్రయానికి బయలుదేరాయి. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు. వ్యాక్సిన్‌ తరలింపునకు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుణె జోన్‌-5 డీసీపీ నమ్రతా పాటిల్‌ మాట్లాడుతూ టీకా మొదటి డోసును సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి తరలించేందుకు విస్తృతమైన భ్రదతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. విమానాశ్రయం నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గౌహతి, లక్నో, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు తరలించనున్నారు.
ట్రక్కుల్లో 478 బాక్సులను తీసుకెళ్లగా.. ప్రతి పెట్టె బరువు 32 కిలోలు ఉంటుంది. ఉదయం 10గంటలకు వ్యాక్సిన్‌ ఆయా రాష్ట్రాలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరో ఐదు కంటైనర్లు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాకు రవాణా చేయనున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ రవాణా కోసం ప్రత్యేకంగా ట్రక్కులు అందుబాటులో ఉంచారు. టీకాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో మూడు కోట్ల మంది హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు టీకాలు వేసేందుకు సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి 1.1కోట్లకుపైగా వ్యాక్సిన్‌ కోసం ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది. కోవిషీల్డ్‌ ప్రతి మోతాదుకు రూ.210 ఖర్చవుతోంది. ఏప్రిల్‌ నాటికి 4.5కోట్ల డోసులు కొనుగోలు చేయనుంది. అలాగే హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌కు కూడా ప్రభుత్వం టీకాలకు ఆర్డర్‌ ఇచ్చింది
error: