రాజగోపాల్‌ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వచ్చింది – హరీష్ రావు

మద్యం, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధిచెప్తారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు. కోమటిరెడ్డి మళ్లీ గెలిస్తే ఏ లాభమని, టీఆర్‌ఎస్‌ను తిట్టడం తప్ప చేసేదేంలేదన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం మర్రిగూడెం మండలం రాజుపేట గ్రామస్తులతో మంత్రి హరీశ్‌ సమావేశమయ్యారు. వారితో కలిసి టిఫిన్‌ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలన్న గిరిజన సోదరుల డిమాండ్‌ను నాడు అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లు పట్టించుకోలేదని చెప్పారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారన్నారు. దీంతో మొత్తం 3146 మంది సర్పంచులు అయ్యారని గుర్తుచేశారు.

గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి ఈ నాలుగేండ్లలో ఒక్కసారైనా గ్రామానికి వచ్చాడా అన్నారు. కనపడని మనిషి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకంటారా లేక అభివృద్ధి చేసే టీఆర్ఎస్‌ని గెలిపిస్తారా.. ఆగం కాకుండా ఓటెయ్యాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలిపించాలన్నారు. గ్రామాభివృద్ధికి తనది బాధ్యత అని స్పష్టం చేశారు.
ఎంబీబీఎస్‌ కోర్సుల్లో గిరిజనులకు పది శాతం కల్పించామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. దీంతో 6615 మెడికల్‌ సీట్లలో 661 సీట్లు ఎస్టీలకు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి అని వెల్లడించారు. విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌తో గిరిజనులకు మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రూ.3 వేలు పెన్షన్ ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనే రూ.700, బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో రూ.600 పెన్షన్ ఇస్తున్నారని చెప్పారు. మరి తెలంగాణలో రూ.3 వేలు ఎలా ఇస్తారన్నారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజుల చేపిస్తా అన్నాడట.. రాజగోపాల్ రెడ్డి అసుంటోడని ఎద్దేవా చేశారు. ముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రూ.3 వేలు పింఛన్‌ ఇచ్చిచూపించాలని డిమాండ్‌ చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు కరెంట్ ఇచ్చిందని, రూ.2 వందలుగా ఉన్న పింఛన్‌ను రూ.2 వేలు చేసిందన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని ప్రతిరైతుకు రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నారు చెప్పారు. సాగునీటి వసతులు కల్పించడంతో భూమికి బరువైన పంట పండుతున్నదని, రైతులు పండించిన ప్రతీగింజను కొనుగోలు చేశామన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వం వెయ్యి ఇండ్లు ఇచ్చిందని, స్వయంగా కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదని విమర్శించారు. బీజేపీ మందు సీసాలు, పైసలిచ్చి ఓట్లు కొనాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే శివన్నడూడెం రిజర్వాయర్‌ను పూర్తిచేసి భూమిలోని ఫ్లోరైడ్‌ను తరిమి కొడతామన్నారు.

error: