ప్రయాణిస్తున్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగి పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ బస్సునిలపగానే కిందికి పరుగందుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ సంస్థకు చెందిన వోల్వో బస్సులో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన కాసేపు టెన్షన్‌కు కారణమైంది.
వివరాల్లోకి వెళితే…టీఎస్ ఆర్టీసీకి చెందిన ఈ బస్సు 50 మంది ప్రయాణికులతో ఉదయం హైదరాబాద్ బయలుదేరింది. కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం మండలం జూపూడి వద్దకు బస్సు వచ్చేసరికి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పొగలు గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను దించేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఏసీ బస్సు కావడంతో పొగలు బస్సు అంతర్భాగంలోకి వెళ్లినా పెద్దప్రమాదం జరిగేది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. విద్యుత్ వైరింగ్‌లో షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు.