రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని.. ఇలాంటి టైంలో తమకు టీఆర్ఎస్ తో సోపతులు, రాజీలు, కలిసిపోవడాలు అంటూ ఏముంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ తో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ అవగాహన ఏర్పడిందనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ వివరాలపై సీఎం కేసీఆర్‌నే అడగాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర కోర్‌కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, నేతలు ప్రకాశ్‌రెడ్డి, రజనీలతో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కేవలం ప్రధాని మోడీపై ఉన్న కోపంతోనే భారత్ బంద్ లో పాల్గొనాలని టీఆర్ఎస్ కేడర్ కు పిలుపునిచ్చారని.. రైతులపై ప్రేమతో కాదని చెప్పారు. తెలంగాణలో జరిగింది రైతు బంద్ కాదని, అది సర్కారీ బంద్ అని విమర్శించారు. బీజేపీ ఆందోళనలకు హైదరాబాద్ లో పిలుపునిస్తే.. ఆదిలాబాద్ లో పార్టీ మండలాధ్యక్షుడిని అరెస్టు చేసే పోలీసులు, భారత్ బంద్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. దీనిపై డీజీపీ మహేందర్‌రెడ్డి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
అగ్రి చట్టాలతో ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని, ఆరు వేలకు పైచిలుకు మార్కెట్ యార్డులను పెంచుతామని కిషన్‌రెడ్డి తెలిపారు. గత ఆరేండ్లుగా దేశంలో యూరియా కొరత, కరెంటు కోతలు ఎక్కడైనా ఉన్నాయా అని నిలదీశారు. త్వరలోనే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి కిసాన్ బ్రాండ్ పేరుతో యూరియాను మార్కెట్లోకి తెస్తామన్నారు. తెలంగాణలో రూ. 950 కోట్లతో 350 గోడౌన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ‘వన్ డ్రాప్ మోర్ క్రాప్’స్కీంతో దేశవ్యాప్తంగా సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్, రైతులకు ఎకరానికి రూ.6,000 సాయం, ఫ్రీగా సాయిల్ టెస్టులు, సబ్సిడీలో కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు, లక్షా14 వేల 578 కోట్లతో రైతులకు వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను కేంద్రం అందజేసిందని వివరించారు. త్వరలోనే 60 ఏండ్లు దాటిన ప్రతి రైతుకు రూ.3 వేల పెన్షన్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించాలని కేంద్రం భావిస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రైతు సంకెళ్లను తెంచేసి, రైతు తన పంటను ఎక్కడైనా మంచి రేటుకు అమ్ముకునే స్వేచ్ఛ కల్పించడం తప్పా అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందే వ్యవసాయంలో కార్పొరే ట్ వ్యవస్థ ఉందని, కార్పొరేట్ల ఔట్లెట్లు ఎవరి హయాం లో మొదలయ్యాయో గుర్తుంచుకోవాలన్నారు.
Tags formers indias pendiond telangana