నర్సాపూర్ బరిలో నిలిచేది ఎవరు ?
మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిట్టింగ్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ ప్రకటించిన సీఎం కేసీఆర్.. నర్సాపూర్ టికెట్ ప్రకటించకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. ఎమ్మెల్యేగా నర్సాపూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను అని మదన్ రెడ్డి చెప్పారు.
నాకు రాజకీయ భిక్ష పెట్టింది సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీని పటిష్టం చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకుల మనోభావాలను పార్టీ కూడా గుర్తించాలని కోరారు.
నర్సాపూర్ స్థానం నాకే కేటాయించాలి. నర్సాపూర్ స్థానం విషయంలో పార్టీ పునరాలోచన చేయాలి. నేను సీట్ వదిలే ప్రసక్తే లేదు. నర్సాపూర్ స్థానం నాకే వస్తుందని నమ్మకం ఉంది. నర్సాపూర్ నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు నాకే మద్దతుగా ఉన్నారు. నర్సాపూర్ లో పార్టీని ముక్కలు చేయవద్దు.
కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్లకు నాకన్నా పెద్ద పదవులు ఇచ్చినా నాకు అభ్యతరం లేదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినా లేదా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా నేను మాత్రం ఎమ్మెల్యే పోటీలో ఉంటాను. నర్సాపూర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఓపికగా ఉండాలి’ అని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు.