అభినందన్ ఈజ్ బ్యాక్

“అభినందన్ ఈజ్ బ్యాక్: గగనతలంలోకి దూసుకెళ్లిన వింగ్ కమాండర్..ఎయిర్ చీఫ్ మార్షల్ తో కలిసి!”
జమ్మూ కాశ్మీర్ లో సరిహద్దులను దాటుకుని మనదేశ గగనతలంలోకి దూసుకొచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని నేలకూల్చిన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్.. పునరాగమనం చేశారు. తనకు ప్రీతిప్రాతమైన మిగ్ 21 యుద్ధ విమానాన్ని నడిపారు. ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా వెంట రాగా..మిగ్ 21 బైసన్ యుద్ధ విమానాన్ని నడుపుతూ గగనతలంలోకి దూసుకెళ్లారు ఘనంగా. పంజాబ్ లోని పఠాన్ కోట్ లో వైమానిక దళానికి చెందిన ఎయిర్ బేస్ నుంచి ఆయన యుద్ధ విమానాన్ని నడిపారు. సుమారు అయిదున్నర నెలల తరువాత అభినందన్.. యుద్ధ విమానాన్ని నడిపించడం ఇదే తొలిసారి.
పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ సమీపంలో జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం నిర్వహించిన మెరుపుదాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ వాయుసేన బలగాలు ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన సరిహద్దులను దాటుకుని, మనదేశ గగనతలంపైకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ యుద్ధ విమానాలను తరిమి కొట్టడానికి అభినందన్.. మిగ్ 21 బైసన్ ను నడుపుతూ వెళ్లారు. పాక్ కు చెందిన ఎఫ్-16ను నేలకూల్చారు. ఈ ప్రయత్నంలో ఆయన పొరపాటున పాకిస్తాన్ భూభాగంపైకి అడుగు పెట్టడం, యుద్ధ ఖైదీగా ఆ దేశ సైన్యానికి పట్టుబడటం తెలిసిందే.
అంతర్జాతీయ దేశాల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గిన పాకిస్తాన్.. అభినందన్ ను రోజుల వ్యవధిలో వదిలి వేసింది. వాఘా సరిహద్దుల వద్ద ఆయనను మనదేశానికి అప్పగించింది. ఆ తరువాత చాలా రోజుల పాటు అభినందన్ విశ్రాంతిలో గడిపారు. కొద్దిరోజుల కిందటే ఆయన వైమానిక దళంలో పునరాగమనం చేశారు.”

error: