ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం.. అమ్మాయిలను అవమానించేలా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా అమ్మాయిలు, మహిళలు ఆధార్ కార్డు చూపించాలనే నిబంధనను ఆర్టీసీ యాజమాన్యం విధించింది. ఇక ఆధార్ కార్డు చూపించి మహిళలు, విద్యార్థినులు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
అయితే కొంతమంది కండక్టర్లు అమ్మాయిల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ లేదంటూ.. కార్డుపై ఉన్న ఫొటో సరిగా లేదంటూ సాకులు చెబుతూ.. అమ్మాయిలను నోటికొచ్చినట్లు తిడుతున్నారు కండక్టర్లు. కొంతమంది కండక్టర్లు అయితే నిర్దాక్షిణ్యంగా మార్గమధ్యలోనే విద్యార్థినులను బస్సుల్లో నుంచి కిందకు దించేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సు నడుస్తుంది. అయితే ఆ బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థినులు చదువుకోవడానికి షాద్‌నగర్ ప్రాంతానికి వెళ్లి వస్తుంటారు. అయితే విద్యార్ధినుల పట్ల ఓ బస్ కండక్టర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆధార్ కార్డులో ఫొటో సరిగా లేదంటూ, టికెట్ తీసుకోవాలని బూతు మాటలు తిడుతూ ఉంటారని విద్యార్థినులు అవేదన వ్యక్తం చేశారు. ఆధార్ అప్డేట్ లేకపోయినా, బ్యాగ్‌లో నుండి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమైనా బండబూతులు తీట్టి మధ్యలోనే బస్సును ఆపి దింపి వేస్తున్నాడని బాధిత అమ్మాయిలు వాపోయారు.
కండక్టర్ ప్రవర్తనతో విసిగిపోయిన బాధిత విద్యార్థినులు షాద్‌నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఇవాళ ఫిర్యాదు చేశారు. అమ్మాయిలని చూడకుండా బూతులు మాట్లాడుతున్న కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విచారణ అనంతరం సదరు కండక్టర్‌పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ తెలిపారు.