ఇంటింటికీ జలధార

-ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2048 సంవత్సరం వరకు పెరిగే జనాభా మేరకు ప్రాజెక్టుకు డిజైన్
-11 కేవీ సబ్‌స్టేషన్లు 6
-33 కేవీ సబ్‌స్టేషన్లు 14
-13 నియోజకవర్గాలకు 6 గ్రిడ్స్ ద్వారా తాగునీటి సరఫరా
-2948.135 కిలోమీటర్ల పొడవున ప్రధాన పైపులైన్
-6292.584 కిలోమీటర్ల పొడవున అంతర్గత పైపులైన్
-98% పైపులైన్ పనులు పూర్తి
-పరుగులు పెడుతున్న మిషన్ భగీరథ
-ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.6,170 కోట్లతో పనులు
-2,247 హ్యాబిటేషన్లకు స్వచ్ఛమైన నీరు
-యుద్ధప్రాతిపదికన ట్రయల్ రన్స్

మిషన్ భగీరథ కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు 6 గ్రిడ్స్ ద్వారా తాగునీరు సరఫరా చేయనున్నారు. గ్రామంలో ప్రస్తుతం ఒక్కోవ్యక్తికి రోజుకు 40 లీటర్లు సరఫరా చేస్తుండగా, మిషన్ భగీరథ కింద వంద లీటర్లు.. మున్సిపాలిటీల్లో వంద లీటర్లకు గాను 135 లీటర్లు.. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజుకు 100 లీటర్లు ఇస్తుండగా, దాన్ని 150 లీటర్లకు పెంచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2048 సంవత్సరం వరకు పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును డిజైన్ చేశారు. 2018 నాటికి 6.189 టీఎంసీలు, 2033 నాటికి 7.696 టీఎంసీలు, 2048 నాటికి 9.264 టీఎంసీలు అవసరం పడుతుందని అంచనావేశారు. జిల్లాలో 2948.135 కిలోమీటర్ల పొడవునా ప్రధాన పైపులైన్, 6292.584 కిలోమీటర్ల పొడవునా అంతర్గత పైపులైన్ అవసరం ఉండగా.. 98 శాతం పైపులైన్ పనులు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలకు సరఫరాచేసేందుకుగాను 1870 సామర్థ్యంగల మోటర్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం కొత్తగా 11 కేవీ సబ్‌స్టేషన్లు 6, 33 కేవీ సబ్‌స్టేషన్లు 14 ఏర్పాటుచేస్తున్నారు. 138.56 ఎకరాల భూమి అవసరం ఉండగా సేకరణ పూర్తయింది. 18 చోట్ల జాతీయ రహదారులను క్రాస్ చేస్తూ పైపులైన్ వెళ్లాల్సి ఉండగా.. పనులు పూర్తయ్యాయి. 717 ఆర్‌అండ్‌బీ రహదారులు, 412 చోట్ల కెనాల్స్, 794 చోట్ల పంచాయతీరాజ్ రోడ్లను క్రాస్‌చేస్తూ పైపులైన్ వెళ్తుంది. అలాగే 26 చోట్ల రైల్వేలైన్ క్రాసింగ్ చేయాల్సి ఉండగా 95 శాతం మేరకు క్రాస్ చేసేందుకు ఇప్పటికే అనుమతి లభించగా పనులు సాగుతున్నాయి.

సీఎం కల్పించిన అదృష్టంగా భావిస్తున్నా
మూడేండ్లు అయితే రిటైర్‌మెంట్ అవుతున్నా.. ఉద్యోగ జీవితంలో ఏమిచేశారని ఎవరైనా అడిగితే.. చెప్పుకోవడానికి గతంలో ఏమీ ఉండేది కాదు.. కానీ ఇప్పుడు మా హయాంలోనే మిషన్ భగీరథ చేశాం అని చెప్పుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి మాకు కల్పించారు. గుట్టలపై నిర్మాణం చేస్తున్న అనేక ఓహెచ్‌బీఆర్ల నిర్మాణాలను చూసి ఇప్పటికే గొప్ప అనుభూతి చెందుతున్నాం. ఇంటికి నీళ్లిచ్చినరోజు మాకంటే ఎక్కువ సంతృప్తి చెందేవారు మరొకరు ఉండరు. ఈ పనులు చేసే భాగ్యాన్ని ముఖ్యమంత్రి మాకు కల్పించిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.
– శ్రీనివాసరావు , మిషన్ భగీరథ ఎస్‌ఈ

error: