ఢిల్లీ, సెప్టెంబర్ 21: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ సునీల్ ఆరోర ప్రకటించారు. మహరాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సునీల్ ఆరోర ప్రకటించారు. ఈ ఎన్నికలతోపాటే ఉప ఎన్నికలు నిర్వహణలో భాగంగా తెలంగాణలో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు సునీల్ ఆరోర ప్రకటించారు.
సెప్టెంబర్ 23న ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 30వరకు నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన, 3న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. అక్టోబర్ 21న పోలింగ్, 24న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. 2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలతోపాటే హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక నిర్వహించబోతునున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో హుజూర్ నగర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి ఊపందుకుంది.
Tags Elections Huzurnagar telangana