ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది ?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతకం ప్రకారం గురువారం ఉదయం 6 గంటల నుంచి 7 వరకు కీలక నిర్ణయాలకు అత్యంత అనుకూల సమయమని, ఆయన నక్షత్ర, రాశులకు అనుకూలంగా గ్రహస్థితులు ఆ రోజు ఉన్నాయని, అందుకే ఆ సమయాన కేబినెట్‌ భేటీకి సీఎం సిద్ధమైనట్లు తెలియవచ్చింది. గురువారం ఉదయం మంత్రివర్గం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేయనున్నట్లు అత్యున్నత అధికార వర్గాల ద్వారా తెలిసింది.

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మెరుపు వ్యూహంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నారు. లక్షలాది మందితో ప్రగతి నివేదన సభ నిర్వహించి 48 గంటలు కూడా దాటకముందే హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. అన్నీ అనుకున్నట్లు గురువారం శాసనసభ రద్దు ప్రకటన వెలువడితే ముఖ్యమంత్రి శుక్రవారం హుస్నాబాద్‌ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకోవడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో కేబినెట్‌ భేటీకి అవసరమైన అన్ని అంశాలను సాధారణ పరిపాలనశాఖ పూర్తి చేసింది. గురువారం ఉదయానికి హైదరాబాద్‌లో ఉండాలంటూ మంత్రులకు ఇప్పటికే సమాచారం పంపింది.

తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేస్తే డిసెంబర్‌లోగా కచ్చితంగా ఎన్నికల జరిగేలా జరుగుతున్న ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం కార్యాయంలోని అధికారి ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, కరీంనగర్‌ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌ వారం రోజులుగా ఢిల్లీలో ఇదే పనిలో నిమగ్నమయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో నెలకొన్న సిబ్బంది కొరత విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదలపై చర్చించేందుకు సీఎస్‌ పిలుపు మేరకే రజత్‌కుమార్‌ వెళ్లినట్లు తెలిసింది. అదనపు సీఈవో పోస్టులో ఐఏఎస్‌ అధికారిని నియమించాలని, జాయింట్‌ సీఈవో, డిప్యూటీ సీఈవోతోపాటు మరో 18 పోస్టులను భర్తీ చేయాలని రజత్‌ కుమార్‌ ఈ సందర్భంగా కోరారు. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒకటి రెండు రోజుల్లోనే సీఈవో కార్యాలయంలో పూర్తిస్థాయి అధికారులు, సిబ్బంది కొలువుదీరనున్నారు. మరోవైపు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో కార్యాలయం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటలకు సమావేశం నిర్వహిస్తోంది.

error: