కరోనా వైరస్ గాలి ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు ఇటీవల స్పష్టంగా చెబుతున్నారు. అది నిజమేనని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా వెల్లడించింది. కొన్ని పరిస్థితుల్లో కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందని పేర్కొంది. శ్వాస వదిలినప్పుడు, మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే సూక్ష్మ తుంపర్ల ద్వారా వైరస్ బయటకు వస్తుందని ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన ఇద్దరు సైంటిస్టులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను, డబ్ల్యూహెచ్ఓను కోరారు. జనంతో కిక్కిరిసిపోయిన, సరైన గాలి, వెలుతురు రాని గదుల్లో కరోనా బాధితులు ఉంటే.. వారి ద్వారా ఇతరులకు వైరస్ సులభంగా వ్యాపిస్తుందన్న వాదనను తోసిపుచ్చలేమని డబ్ల్యూహెచ్ఓ తాజాగా స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు కనిపించని(అసింప్టమాటిక్) బాధితుల నుంచి సైతం వైరస్ గాలి ద్వారా సోకే ప్రమాదం ఉందని తెలిపింది.