తెలంగాణాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉన్నది.ఈ నెలాఖరులోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.ఈ ఎన్నికలను మూడు దశల్లో..అంటే జనవరి 17,21,27 తేదీల్లో నిర్వహించనున్నట్టు సమాచారం.ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, రెండు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టి,ఫలితాన్ని వెల్లడించనున్నారని తెలుస్తున్నది. మొత్తం ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమవుతున్నదని సమాచారం. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. రిజర్వేషన్ల జాబితా కోసం ఎదురు చూస్తున్నది. రిజర్వేషన్లను త్వరలో ఖరారు చేస్తామని, రాష్ట్రం యూనిట్ గా సర్పంచ్, గ్రామం యూనిట్ గా వార్డు స్థానాలను రిజర్వు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి తెలిపింది. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు,డీపీవో లతో పంచాయత్ రాజ్ అధికారులు సమావేశమయ్యారు. రిజర్వేషన్ల మార్గదర్శకాలను సూచించారు.సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50శాతం లోపు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ రెండు రోజులో ముగుస్తుందని సమాచారం.
