జోర్డాన్ దేశంలోని అమ్మాన్ నగరంలో జరుగుతున్న ఐదుదేశాల అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీలో భారత అండర్-16 జట్టు పటిష్ఠమైన యెమెన్ జట్టును కంగుతినిపించింది. యువ భారత జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 3-0 గోల్స్‌తో మెరుగైన యెమెన్ జట్టును ఓడించింది. గతవారం అండర్ -20 విభాగంలో అర్జెంటీనాపై భారత కుర్రాళ్లు విజయంతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అదే తరహాలో అండర్-16 జాతీయజట్టు కూడా మనకన్నా మెరుగైన యెమెన్‌ను చిత్తు చేయడం గమనార్హం.తొలి అర్థభాగం 37వ నిమిషంలో జట్టు సెంట్రల్ డిఫెండర్ హర్‌ప్రీత్ సింగ్ హెడ్డర్‌తో అద్భుతమైన గోల్ చేసిన జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. మరో రెండు నిముషాలకే రిడ్గె డిమెల్లో హెడ్డర్‌తో కళ్లు చెదిరే గోల్ కొట్టి 2-0తో తిరుగులేని ఆధిపత్యాన్ని అందించాడు. రెండో అర్థభాగం 47 నిమిషంలో రోహిత్ డాను గోల్‌తో 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ ముగిసే వరకు యెమెన్ జట్టుకు గోల్ కొట్టే అవకాశం ఇవ్వకుండా ఆడిన భారత కుర్రాళ్లు అద్భుత విజయంతో సంచలనం సృష్టించారు