బీసీ అభ్యున్నతిలో దేశానికి దిక్సూచి

దేశవ్యాప్తంగా అమలుకానీ మండల్ కమిషన్ నివేదికలోని మిగతా 39 అంశాలను కొంతవరకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నది. బోధనా రుసుం మినహాయింపు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, వసతిగృహ సదుపాయాలు కల్పిస్తున్నది. జ్యోతిబా పులే బీసీ గురుకులాలను స్థాపించి సమగ్ర విద్య పథకాన్ని అమలు చేస్తున్నది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 బీసీలను బలహీన వర్గాలుగా పేర్కొన్నది. వీరి అభ్యున్నతికోసం ఆర్టికల్ 340 ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులతో ఒక కమిషన్‌ను నియమిం చి ఆ కమిషన్ ఇచ్చే సిఫార్సుల మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవచ్చు. అంబేద్కర్ మహిళలకు సమాన హక్కు కల్పించే హిందూ కోడ్ బిల్లు, ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు, ఇతర చర్యలు తీసుకోవడం కోసం బీసీ కమిషన్‌ను నియమించడంలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా న్యాయశాఖ మంత్రిత్వానికి రాజీనామా చేశాడు. 1950 నాటికి ఆర్.ఎల్. చంధాపురి (కుర్మి-మహారాష్ట్రలోని కున్భీలనే (కాపు) ఉత్తర భారతంలో కుర్మీలుగా పిలవబడుతారు) ఢిల్లీలో ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్‌ను స్థాపించి దేశవ్యాప్త బీసీల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టి అంబేద్కర్‌ను సమావేశాలకు ఆహ్వానించిండు. ఓబీసీల ఉద్యమం దేశమంతా విస్తరించే అవకాశం ఉందని గ్రహించి న నెహ్రూ ఆర్టికల్ 340ప్రకారం బీసీల స్థితిగతుల గురించి పరిశోధించి వారి పరిస్థితులను మెరుగుపరిచేందుకు సూచనలు ఇచ్చేందుకు 1953 జనవరిలో కాకా కాలేల్కర్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 1955 మార్చిలో తన నివేదికను సమర్పించింది. 2,399 వెనుకబడిన కులాలుగా, 837 అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించి వారి సంక్షే మం కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించింది.అయినా దాన్ని అమలుపర్చకుండా అటకెక్కించిండ్రు.

1977లో జనతా పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే కాలేల్కర్ కమిషన్ నివేదికను అమలుచేస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచిన జనతా పార్టీ కాలేల్కర్ నివేదిక చాలారోజుల కిందటిది కాబట్టి కొత్త కమిషన్‌ను నియమించి ఆ కమిషన్ ఇచ్చే నివేదికను బట్టి తగు చర్యలు తీసుకుంటామని ప్రధాని మొరార్జీ దేశాయ్ పార్లమెంట్‌లో 1978, డిసెంబర్ 20న ప్రకటన చేసిండు. అప్పటి బీహార్‌కు చెందిన పార్లమెంట్ సభ్యుడు బీపీ మండల్ యాదవ్ ఛైర్మన్‌గా మరో నలుగురు సభ్యులు, సెక్రెటరీతో రెండవ బీసీ కమిషన్ ఏర్పాటు జరిగింది. ఇదే బీపీ మండల్ కమిషన్. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గురించి ఆర్టికల్15(4), 16(4)లపై నిర్ణయం తీసుకునేందుకు 11 సూచికలతో దేశ జనాభాలో 52 శాతం ఉన్న 3,743 బీసీ కులాల సమగ్రాభివృద్ధికి 40 సూచనలు చేసింది. అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభు త్వ ఉన్నత విద్యా సంస్థలల్లో పాటు జాతీయ బ్యాంకుల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో, ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థల్లో కూడా 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది ముఖ్యమైన సిఫార్సు. అప్పటికే ఎస్సీ, ఎస్టీలు పొందుతున్న రిజర్వేషన్ల కోటా 22.5శాతం ఉన్నందున మొత్తం లో రిజర్వేషన్ల కోటా 50 శాతానికి దాటకూడదనే తీర్పుకు లోబడి మండల్ కమిషన్ ఈ సూచన చేసింది.

ఐతే మండల్ కమిషన్ తన నివేదికను 1980 డిసెంబర్ 31న సమర్పించే నాటికి జనతా ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మండల్ కమిషన్ నివేదిక మూలన పడింది. మండల్ కమిషన్ నివేదికను అమలుపర్చాలని దేశవ్యాప్తంగా బీసీలంతా కలిసి ఒక సంస్థను స్థాపించుకున్నారు. 1981, సెప్టెంబర్ 11న నేషనల్ యూనియన్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ అనే సంస్థను బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ (మంగలి) ప్రారంభించిండు. చౌదరి బ్రహ్మప్రకాశ్ యాదవ్ దీనికి అధ్యక్షుడు. ఈ సంస్థ 110 మంది పార్లమెంట్ సభ్యుల సంతకాల తో కూడిన మెమోరాండాన్ని ప్రధాని ఇందిరాగాంధీకి సమర్పించి మండ ల్ కమిషన్ నివేదికను వెంటనే అమలుపరుచాలని డిమాండ్ చేసిండ్రు. 1982లో 5లక్షల మంది సంతకాలతో రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌కు మం డల్ కమిషన్ అమలు జరిగేలా చూడమని విజ్ణప్తి చేసిండ్రు. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ కూటమి మండల్ కమిషన్ నివేదికను అమలుచేస్తామని తన మ్యానిఫెస్టోలో పెట్టింది. నేషనల్ ఫ్రంట్ ఏర్పడిన 1988 నుంచి బీఎస్పీ మండల్ కమిషన్ అమలుకోసం ఉద్యమించింది. ప్రధాని వీపీ సింగ్, దేవీలాల్ మధ్య ఏర్పడిన విభేదాల వల్ల కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకి వచ్చి కాన్షీరామ్‌తో చేతులు కలిపి 1990 ఆగస్టు 9న ఢిల్లీలో మండల్ కమిషన్ నివేదిక అమలు, రైతుల సమస్యలపై ప్రధాన డిమాండ్లుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించతలపెట్టిండు.

ఈ ర్యాలీని దృష్టిలో పెట్టుకొని రెండ్రోజుల ముందే అంటే 1990, ఆగస్టు 7న వీపీసింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ చేసిన 40 సూచనల్లో ఒక సూచనను పాక్షికంగా అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్ల అమలును ప్రకటించింది. ఈ ప్రకటన చేస్తే తమ ప్రభుత్వాన్ని కూలదోస్తామని అప్పటికే తన మద్దతుదారులుగా ఉన్న ప్రధా న జాతీయపార్టీలు హెచ్చరించినప్పటికీ వీపీ సింగ్ దేశ చరిత్ర లో ఒక గొప్ప కీలక ప్రకటనకు ఆద్యుడైండు.ఆ ప్రకటనను నిశ్శ బ్ద విప్లవంగా వీపీ సింగ్ పేర్కొన్నాడు. ఈ సంఘటన గురించి చెప్పుతూ కేసీ యాదవ్ తన ఇండియాస్ అన్ ఈక్వల్ సిటిజెన్స్ అనే పుస్తకంలో ఇలా రాసిండు. భారతదేశానికి స్వాతంత్య్ర ప్రకటన జరిగిన 1947, ఆగస్టు 15, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950, జనవరి 26 వంటి గొప్ప సంఘటనల తర్వాత భారత దేశ చరిత్రలో చోటు చేసుకున్న మూడవ అతి గొప్ప సంఘటన ఇది. కానీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రధాన పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు మెరిట్ పేరిట ఉద్యమం లేవదీశాయి. ఈ నేపథ్యంలోంచే 1990 నవంబర్ 7న వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోయింది. అగ్రవర్ణాలు వీపీ సింగ్ ప్రభుత్వ ప్రకటనపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చిండ్రు. చివరికి సుప్రీంకోర్టు బీసీలకు క్రీమీ లేయర్ నిభంధనలు పెట్టి ఇచ్చిన తీర్పుతో 43 ఏండ్ల తర్వాత 1993 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 1990 ఆగస్టు 7న జరిగిన చారిత్రక ప్రకటన గుర్తుగా ఈ దేశ బీసీలు మండల్ కమిషన్ నివేదించిన మిగతా 39 సిఫార్సుల అమలు కోసం డిమాండ్ చేస్తూ ఏటా ఆగస్టు 7ను మండల్ డే (బీసీల రాజ్యాంగపరమైన హక్కుల సాధన దినం)గా జరుపుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా అమలుకానీ మండల్ కమిషన్ నివేదికలోని మిగతా 39 అంశాలను కొంతవరకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నది. బోధనా రుసుం మినహాయింపు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, వసతిగృహ సదుపాయాలు కల్పిస్తున్నది. జ్యోతిబా పులే బీసీ గురుకులాలను స్థాపించి సమగ్ర విద్య పథకాన్ని అమలుచేస్తున్నది. ఈ ఆగస్టు 7, మండల్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, చట్టబద్ధమైన హక్కులు కల్పించి తెలంగాణ బీసీలను జాతీయస్థాయిలో తమ హక్కుల కోసం పోరాడే విధంగా ప్రోత్సహిస్తదని కోరుకుందాం.
(నేడు బీసీ హక్కుల సాధన దినం)

error: