కరుణానిధి మృతికి ప్రముఖుల సంతాపం

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు . ప్రజాజీవితంలో విశిష్ట నేతగా పేరొందిన కరుణానిధి తమిళనాడుకు, దేశానికి విలువైన సేవలు అందించారన్నారు. దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ ట్వీట్‌ చేశారు.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కరుణానిధి తన జీవితాన్ని పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. కరుణానిధి మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. దేశంలోనే అత్యంత సీనియర్‌ నేత కరుణానిధి అని చెప్పారు. కరుణానిధి జననేత, తత్వవేత్త, ఆలోచనాపరుడు, రచయిత, శిఖరసమానుడని ప్రధాని ట్వీట్‌ చేశారు.

కరుణానిధి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు కాంగ్రెస్ ప్రసిడెంట్ రాహుల్ గాంధీ. భరతమాత తన ముద్దుబిడ్డను కోల్పోయిందని రాహుల్ ట్వీట్ చేశారు. 6 దశాబ్దాల పాటు తమిళ ప్రజలు, రాజకీయాల్లో కరుణానిధి చెరగని ముద్ర వేశారన్నారు.

కరుణానిధితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. ప్రాంతీయ పార్టీలకు ఒక దశ, దిశను చూపించిన నేత కరుణానిధి అని చెప్పారు. పరిపక్వత కలిగిన కరుణానిధి ఎంతో హుందాగా రాజకీయం చేసేవారన్నారు.

కరుణానిధి కిందిస్థాయి నుంచి కష్టపడి ఉన్నత నేతగా ఎదిగారని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కరుణానిధి మృతి పట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్, కేంద్రమంత్రులు, పలువురు నేతలు తీవ్ర సంతాపం తెలిపారు.

కరుణానిధి మరణం తనను ఎంతో కలిచివేసిందన్నారు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌. కరుణానిధికి కాంగ్రెస్ పార్టీతో మంచి అనుబంధం ఉందన్నారు.

కరుణానిధి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్. తన జీవితంలో ఇది చీకటి రోజని చెప్పారు. నటుడు కమల్‌ హాసన్‌ సైతం కరుణ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కరుణానిధి నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడారని అన్నారు.

error: