రాష్ట్రంలోని జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సీనియర్ జర్నలిస్ట్ ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన ఆయన రేవంత్ సర్కార్ అను సరిస్తున్న విధానాలను ఎండగట్టారు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అరాచక పాలన సాగిస్తు న్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే జర్నలిస్టులు శంకర్. చిలుక ప్రవీణ్, సరిత ఆవుల, విజయారెడ్డిలపై దాడులు జరిగాయని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి సొంత ఊర్లో మహిళా జర్నలిస్టులకు రక్షణ లేదని, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే తెలంగాణాలో ఆటవిక రాజ్యం నడుస్తోందని వాపోయారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థలోని కొంత మంది అధి
కారులు కండువా కప్పుకున్న కాంగ్రెస్ కార్యకర్తల కంటే దారుణంగా ఊడిగం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు..
కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావు చేసిన అక్రమాలను బయటపెట్టేందుకు ప్రయత్నించిన తనపై కూడా హత్యాయత్నం చేశారని ఆయన అన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపైనా దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటి కైనా జర్నలిస్టులపై దాడులను ఆపకుంటే ఒక్కరు కాదు.. తెలంగాణలోని జర్నలిస్టులు అందరూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తారని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. జంతర్ మంతర్ దగ్గరే కాదని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తామని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు..
