వాయు మార్గంలో సాయుధ దళాల తరలింపు


దిల్లీ: కొన్ని మార్గాల్లో కేంద్ర సాయుధ పారామిలటరీ దళాలకు విమాన ప్రయాణాలకు అనుమతి ఇస్తూ నేడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దిల్లీ-శ్రీనగర్‌, శ్రీనగర్‌-దిల్లీ, జమ్ము-శ్రీనగర్‌, శ్రీనగర్‌-జమ్ము మార్గాల్లో అన్ని రకాల కేంద్ర సాయుధ పారామిలటరీ దళాలు ఇక వాయుమార్గంలో ప్రయాణించవచ్చు. దీంతో దాదాపు 7,80,000 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది లబ్ధి పొందనున్నారు. ఇప్పటి వరకు ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ర్యాంక్‌ సిబ్బందికి విమాన ప్రయాణాలకు అనుమతిలేదు.

తాజా ఆదేశాలతో విధినిర్వహణలో భాగంగా ప్రయాణాలు, సెలవుపై ప్రయాణాల్లో కూడా ఇది వర్తిస్తుంది. అంటే జమ్ముకశ్మీర్‌లో విధుల్లో ఉన్న సిబ్బంది సెలవుపై ఇంటికి వెళ్లే సమయంలో కూడా విమాన ప్రయాణం చేయవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా హోంమంత్రిత్వశాఖ పేర్కొన్న మార్గాల్లో వైమానిక సేవలను కూడా ప్రభుత్వం క్రమంగా పెంచనుంది. ఈ నిర్ణయంతో జవాన్ల ప్రయాణ సమయం బాగా తగ్గిపోతుంది. దీనికి అవసరమైన సహకారాన్ని వాయుసేన నుంచి తీసుకోనున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన విధుల్లో చేరేందుకు వస్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై పుల్వామా వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 42 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

error: