వ్యాక్సిన్ వచ్చిన లాక్ డౌన్ తప్పదా ?

ఏడాది క్రితం ఇదే రోజు.. 2020లో ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోతున్న కరోనాను కట్టడి చేసేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్‌ మంత్రం జపించాయి. భారత్‌లోనూ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకే కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది. మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించారు ప్రధాని మోడీ. వుహాన్‌లో పుట్టి మరణమృదంగం మోగించిన కరోనా కేసులు భారత్‌లోనూ వెలుగుచూడడంతో.. వైరస్‌ ఛైన్‌ లింక్‌ కట్ చేసేందుకు ప్రజలను ఇళ్లకు పరిమితం చేయాలని భావించి, నాడు జనతా కర్ఫ్యూతో మొదలైన లాక్‌డౌన్ ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది.
కరోనా వైరస్‌ దెబ్బకు దేశమంతా తొలిసారి జనతా కర్ఫ్యూ ప్రకటించి సరిగ్గా నేటికి ఏడాది. కొవిడ్‌ వ్యాప్తిపై అవగాహనతో పాటు, వైద్యులకు సంఘీభావం తెలిపేందుకు నాడు ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు జనతా కర్ఫ్యూ విధించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జనం ఇంట్లో నుంచి కదలకుండా ఉండాలని కోరారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మద్దతుగా సాయంత్రంపూట కాసేపు రోడ్లమీదకు వచ్చి చప్పుళ్లతో సంఘీబావం తెలపాలని కోరారు.
జనతా కర్ఫ్యూ ఒక్కరోజే కదా? అనుకున్న జనానికి కేంద్రం షాకిచ్చింది. మార్చి 25 నుంచి కేంద్ర ప్రభుత్వం 23 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్‌ విధించింది. సరిహద్దుల్ని కూడా మూసేసి, రాకపోకల్ని నిషేధించింది. రెండో విడతలో ఏప్రిల్‌ 15 నుంచి మే 3 వరకు 19 రోజుల పాటు అమలు చేసింది. మూడో విడతలో మే 4 నుంచి 17 వరకు 14 రోజులపాటు లాక్‌డౌన్‌ పెట్టింది. చివరిగా మే 18 నుంచి 31 వరకు 14 రోజులపాటు దాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఆ తర్వాత జూన్‌ 1 నుంచి అన్‌లాక్‌ప్రక్రియను ప్రారంభించి, దశలవారీగా దాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
కొవిడ్‌ 19 వైరస్‌ కొత్తది కావడం, మన ఆరోగ్య మౌలిక సదుపాయాల అంతంత మాత్రంగా ఉండటంతో.. భారత్‌కు ముందు ఉన్న ఏకైక అస్త్రం లాక్‌డౌన్‌. దాన్ని సరైన సమయంలో సమర్థవంతంగా అమలు చేశారు. దీంతో తొలినాళ్లలో కొవిడ్‌పై పైచేయి సాధించాం. ఇదే విషయాన్ని భారత ఆర్థిక సర్వే కూడా కొనియాడింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంతో పాటు సెకండ్‌ వేవ్‌ను, నూతన వేరియంట్లను కొంతవరకు లాక్‌డౌన్‌తో అడ్డుకట్ట వేయగలిగాం. కానీ, కరోనా వైరస్ ఏమంటూ వచ్చిందో కానీ దేశంలో వలస కార్మికులకు ప్రాణ సంకటాన్ని తెచ్చిపెట్టింది.
లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల బతుకులను ఈ మహమ్మారి ఛిద్రం చేసింది. తినేందుకు తిండి లేక, సొంతూరు వెళ్లే వీలు లేక చిత్రవధ అనుభవించారు. చేసేందుకు పనిలేక, తినేందుకు తిండి లేక, వలస వెళ్లిన చోట ఉండలేక, సొంతూరి బాటపట్టారు. వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడమే తరువాయి. భార్య, పిల్లలు, బంధుమిత్రులతో కలిసి పయనమయ్యారు. సొంతూర్లలో కలోగంజో తాగి బతుకుదామని బయల్దేరారు. అవకాశం ఉన్నవాళ్లు ప్రైవేటు వాహనాలు, శ్రామిక్‌రైళ్లను ఆశ్రయిస్తే… ఈ సదుపాయాలేవీ అందుబాటులో లేని వాళ్లు కాలి నడకను నమ్ముకుని స్వగ్రామాలకు చేరారు. వందల, వేల కిలోమీటర్లు కాలినడకనే వెళ్లిన వలస కూలీల బాధలు చూస్తే దేశం గుండె తరుక్కుపోయింది.

గతేడాది జూన్‌ 1 నుంచి అన్‌లాక్‌ ప్రక్రియను ప్రారంభించిన కేంద్రప్రభుత్వం… దశలవారీగా దాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఆ తర్వాత వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో… కరోనా కేసులు పెరుగుతున్నా క్రమంగా జనజీవనం సాధారణ స్థితికి చేరింది. అయితే, కొద్దిరోజులుగా మళ్లీ దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలు ప్రారంభించాయి. కొన్ని నగరాల్లో నిబంధనలు కట్టుదిట్టం చేయడంతో పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు కేంద్రం సుముఖంగా లేకపోయినా.. నగరాలు, పట్టణాల్లో పరిస్థితులను బట్టి.. మళ్లీ ఆంక్షలు మొదలవుతున్నాయి.దేశంలో ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. తగ్గినట్లే తగ్గిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు కరోనాను తేలిగ్గా తీసుకోవడంతో వైరస్ వ్యాప్తి మళ్లీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో మరోసారి లాక్‌డౌన్‌ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. గతేడాది ఇదే సమయానికి కరోనా పేరు వింటేనే దేశం వణికిపోయింది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడ్డారు. కానీ, ఇప్పుడు సీన్‌ రివర్స్‌. కరోనా అంటే లెక్కలేనితనం పెరిగింది. వ్యాక్సిన్‌ వచ్చిందన్న ధైర్యమో.. వైరస్‌ మనల్ని ఏమీ చేయలేదన్న తెగింపో తెలియదు కానీ.. జనంలో భయం లేకుండాపోయింది. జనతా కర్ఫ్యూకు ముందు పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయి. దీంతో కొన్నిచోట్ల పూర్థిస్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తుండగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా కర్ప్యూలాంటి చర్యలు చేపట్టారు.

error: