సోషల్ మత్తు , వీరే ఎక్కువ చిత్తు

దేశంలోని యువత సామాజిక మాధ్యమాలకు బానిసగా మారుతున్నది. రోజులో సగటున 7 గంటలు సోషల్‌ మీడియాలోనే మునిగి తేలుతున్నది. ఐఐఎం-రోహ్‌తక్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అబ్బాయిల కంటే అమ్మాయిలే అధికంగా సోషల్‌ మీడియా వినియోగిస్తున్నారు.
సగటున అబ్బాయిల స్క్రీన్‌ టైమ్‌ 6 గంటల 45 నిమిషాలు ఉండగా, అమ్మాయిల స్క్రీన్‌ టైమ్‌ 7 గంటల 5 నిమిషాలుగా ఉన్నది. 60.66 శాతం యువత సోషల్‌ మీడియా వేదికలను వాడుతున్నారు. సాయంత్రం వేళల్లోనే వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన కంటెంట్‌నే 50 శాతం మందికిపైగా చూస్తున్నారు. గత దశాబ్ద కాలంలో స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా వినియోగం అసాధారణ రీతిలో పెరిగినట్టు ఐఐఎం పేర్కొన్నది. ఇంటర్నెట్‌ వసతులు మెరుగుపడటం, అందుబాటు ధరలో డాటా ప్లాన్స్‌ లభిస్తుండటం వల్ల పెద్ద సంఖ్యలో యువత డిజిటల్‌ మీడియావైపు మళ్లుతున్నట్టు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్స్‌ ఫాలో అవ్వడం దగ్గర నుంచి యూట్యూబ్‌లో కంటెంట్‌ చూడటం వరకు.. సామాజిక మాధ్యమాలు యువత స్క్రీన్‌టైమ్‌ను అమాంతం పెంచినట్టు వివరించింది. గత ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ మధ్య 18-25 ఏండ్ల వయసున్న 38,896 మందిపై అధ్యయనం నిర్వహించినట్టు పేర్కొన్నది. వీరిలో 18,521 మంది అబ్బాయిలు కాగా, 14,375 మంది అమ్మాయిలు ఉన్నట్టు తెలిపింది.

వీరు ప్రధానంగా యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, సఫారి, గూగుల్‌ క్రోమ్‌ వినియోగిస్తున్నట్టు తెలిపింది. అలాగే సంప్రదాయ ఫోన్‌ కాల్స్‌ కంటే ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ వాట్సాప్‌ కాలింగ్‌కే ప్రాధానమిస్తున్నదని, ప్రైవసీని కోరుకోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. డిజిటల్‌ అవకాశాలు, మానసిక ఆరోగ్యానికి సమప్రాధాన్యం ఇచ్చేలా జాగరూకతతో వ్యవహరించాలని ఐఐఎం సూచించింది.

error: