మరోసారి ‘కిసాన్‌ ర్యాలీ’ చేపట్టిన రైతులు

ముంబయి: కనీస మద్దతు ధర, రుణమాఫీ కోరుతూ మహారాష్ట్ర రైతులు మరోసారి రోడ్డెక్కారు. కిసాన్‌ ర్యాలీ పేరుతో నాసిక్‌ నుంచి ముంబయి వరకు 180కి.మీ మేర రైతులు ర్యాలీ నిర్వహించనున్నారు. గతంలో భాజపా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంత వరకు అమలు చేయకపోవడంతో తాము మరోసారి ర్యాలీ బాట పట్టినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గత రాత్రి మహారాష్ట్ర ప్రభుత్వంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో గురువారం కిసాన్‌ మార్చ్‌ పేరిట ర్యాలీకి చేపట్టారు. దీనిలో వేలాది మంది పాల్గొన్నారు.

‘పెద్ద ఎత్తున మార్చ్‌ చేసేందుకు మేం కదిలాం. కానీ పోలీసులు మాకు అనుమతి నిరాకరించారు. గత రాత్రి మంత్రి గిరీష్‌ మహాజన్‌తో సమావేశమై మా డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. కానీ ఈ దఫా మాకు మాటల హామీలు వద్దు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి లిఖితపూర్వక హామీ కావాలి. అప్పటి వరకు మేం ర్యాలీని కొనసాగిస్తాం’ అని ఆల్‌ఇండియా కిసాన్‌ సభా నేత అశోక్‌ ధవాలే తెలిపారు. తొలుత అనుమతి నిరాకరించినప్పటికీ తర్వాత నాసిక్‌ వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. ట్రక్కులు, వ్యాన్లు, ట్రాక్టర్లు, టెంపోల ద్వారా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు గత రాత్రి నాసిక్‌ చేరుకున్నారు. ఫిబ్రవరి 27న ముంబయిలోని శాసనసభ వద్దకు చేరుకోగానే ర్యాలీని ముగించనున్నారు. దాదాపు 7500 మంది రైతులు ఈ కిసాన్‌ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. గతేడాది మార్చిలో కూడా రైతులు ఇదే విధంగా ర్యాలీని చేపట్టారు. దాదాపు 30వేల మంది రైతులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

error: