కడప జిల్లా ముద్దనూరులో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన డ్రైవర్‌ను దొంగతనం నెపంతో చెట్టుకు కట్టేసి అనుచరులతో యజమాని విచక్షణా రహితంగా కొట్టించిన ఘటన చోటుచేసుకుంది. దాడిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి పోస్టు చేశారు. షోషియల్ మీడియాలో
ఆ వీడియో వైరల్ అయింది.
ముద్దనూరులోని తాడిపత్రి రోడ్డులో ఓ ట్రాన్స్‌పోర్టు యజమాని వద్ద కర్ణాటక రాష్ట్రం చిక్‌బల్లాపూర్ జిల్లా గుడిబండ ప్రాంతానికి చెందిన గిరీష్ అనే యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. సిమెంటు బస్తాలు తక్కువ రావడంతో వాటిని పక్కదోవ పట్టించారని ఆరోపిస్తూ అనుచరులను దాడికి పురమాయించారు. పక్కనే ఉన్న చెట్టుకు కట్టేసి రబ్బరు పైపుతో కొట్టించారు. సిమెంటు బస్తాలు తాను దొంగలించలేదని మొరపెట్టుకుంటున్నా వినకుండా దాడి చేయించడం దారుణమని స్థానికులు అంటున్నారు.
సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న బాధిత డ్రైవర్ తండ్రి ముద్దనూరుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్‌పోర్టు యజమాని నాదెళ్ల గురునాథ్, నాదెళ్ల గురుదేవ, నాదెళ్ల గురుప్రసాద్, కాపలాదారు ఓబులేసుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు. సమగ్ర విచారణ జరిపి బాధితునికి న్యాయం చేస్తామన్నారు. డ్రైవర్ గిరీష్ గుడిబండలో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు