కొత్త జోన్లకు ఆమోదంతో సంబరాలు

రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ విడుదలైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, విద్యావంతులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఓయూలో విద్యార్ధులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితమే ఈ కొత్త జోన్ల ఏర్పాటు అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక.. కొత్త జోనల్ వ్యవస్ధ అనేది మరొక మైలురాయిగా చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. జోన్ల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ కు, రాష్ట్రపతికి విద్యార్ధి నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

కొత్త జోనల్‌ విధానం ఇదీ..

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. మొదటి నాలుగు జోన్లను ఒక బహుళజోన్‌గా, మిగిలిన మూడు జోన్లను రెండో బహుళజోన్‌గా పరిగణిస్తారు.

ప్రస్తుతం తెలంగాణలో జిల్లా కేడర్‌లో 80:20, జోనల్‌ కేడర్‌లో 70:30, బహుళజోనల్‌లో 60:40 నిష్పత్తిలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగాలను జిల్లా, జోనల్‌, బహుళజోన్‌, రాష్ట్రస్థాయి కేడర్లుగా పరిగణిస్తారు. మొదటి మూడింటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. వాటికి 95 శాతం స్థానిక రిజర్వేషన్లు, అయిదు శాతం స్థానికేతర రిజర్వేషన్లు ఇస్తారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోస్టుల్లో రిజర్వేషన్లు లేవు. అందరూ వీటికి పోటీపడేవారు. కొత్త విధానంలో రాష్ట్ర స్థాయి పోస్టులకు ప్రత్యక్ష నియామకాలను పూర్తిగా నిలిపివేసి కేవలం పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు.

ప్రస్తుతం నాలుగు నుంచి పది తరగతుల్లో నాలుగేళ్లపాటు చదివినవారిని స్థానికులుగా గుర్తిస్తున్నారు. ఇకపై ఒకటి నుంచి ఏడు తరగతుల్లో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులవుతారు. జిల్లా, జోన్లు, బహుళజోన్లు, రాష్ట్రస్థాయిలో ఎక్కడ వరుసగా నాలుగేళ్లు చదివితే అక్కడే వారు స్థానికులవుతారు.

నూతన జోన్లు : కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ. అయితే కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు ఒక మల్టీ జోన్‌గా, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు కలిపి మరో మల్టీ జోన్‌గా ఏర్పడ్డాయి. పోలీసు శాఖ మినహా అన్ని శాఖలకు జోన్ల వర్తింపు జరగనుంది. పోలీసు శాఖ కోసం ప్రత్యేకంగా జోన్లను ఏర్పాటు చేశారు.

error: