అహ్మదాబాద్ : అతివలు బంగారు ఆభరణాలు ధరించడం చూశాం. కానీ ఆవులు బంగారు ఆభరణాలు ధరించడం కొత్తగా ఉంది కదా! మీరు చదువుతున్నది నిజమే.. గుజరాత్‌కు చెందిన ఓ జంతు ప్రేమికుడు తన వద్ద ఉన్న ఆవు, దాని దూడకు బంగారు, వెండి ఆభరణాలు చేయించి ప్రేమను చాటుకున్నాడు.
విజయ్ పర్సానాకు ఆవు, దూడ ఉంది. అయితే వాటికి బంగారు, వెండి నగలు చేయించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఏబీ జ్యువెలర్స్ యజమాని మనోజ్ సోనిని సంప్రదించాడు. అతను ఆవులకు ఆభరణాలు చేసేందుకు అంగీకరించాడు. ఆ తర్వాత ఆవును, దూడను ఏబీ జ్యువెలర్స్‌కు విజయ్ తరలించాడు. అక్కడ ఓ గదిని పూలతో సుందరంగా అలంకరించి.. ఆవు, దూడకు బంగారు ఆభరణాలు ధరింపజేశారు. అనంతరం ఆ రెండింటిపై గులాబీ పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుటుంబ సభ్యులతో పాటు జ్యువెలర్స్ సిబ్బంది పాల్గొన్నారు.