ఈ జన్మ మీకోసమే మీలో ఒకడిగా ఉంటా-హరీష్ రావు

నా ఊపిరి ఉన్నంత వరకు మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటా అన్నారు సిద్ధిపేట లో జరిగిన ఇంటింటి ఎన్నికల ప్రచారంలో తన్నీరు హరీష్ రావు గారు.ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ,
‘‘సిద్దిపేట ప్రజలే నా కుటుంబం.. నన్ను కూడా అదే అభిమానంతో ఆదరిస్తున్నారు. అందుకే నా సమయాన్ని, జ్ఞానాన్ని, ఆలోచనను, ఆరాటాన్ని.. తుదకు నా ప్రాణాన్ని సైతం మీకోసమే అంకితం చేయడానికి సిద్దపడ్డాను అన్నారు. నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో మీ బిడ్డగా నన్ను అక్కున చేర్చుకున్నారు. రాజీనామా చేసిన ప్రతీసారి మేమున్నామంటూ ఓట్ల వరద పారించి గెలిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, మీ అభిమానాలే నాకు శ్రీరామరక్షగా నిలిచాయి. మనందరి స్వప్నం ఫలించి తెలంగాణ రాష్ర్టం సాకారమైంది. కోటి ఎకరాల మాగాణిగా మన రాష్ర్టాన్ని తీర్చిదిద్దడానికి నీటిపారుదల శాఖ మంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించారు. యావత్ తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిచే గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఓ వైపు ఇన్నాళ్లు వివక్షకు గురైన ఎన్నో ప్రాజెక్టులను గమ్యం చేర్చడానికి శ్రమిస్తున్నాను అన్నారు. మరో వైపు నా కన్నతల్లి లాంటి సిద్దిపేట అభ్యున్నతికి సంతోషంగా పనిచేస్తున్నాను. ఎక్కడ ఉన్నా నా మనసంత సిద్దిపేటపైనే ఉంటుందనే విషయం నాకంటే ఎక్కువగా మీకే తెలుసు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికే సిద్దిపేట పట్టణాన్ని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాను. ప్రతీ విషయంలో కూడా మీరు చేస్తున్న సహకారమే నన్ను ముందుకు నడిపిస్తున్నది.. కాని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎన్నో అభివృద్ధి పనులను ఇక్కడ చేసుకున్నాము. మన సిద్దిపేట పేరు లేకుండా అవార్డులు, రివార్డుల జాబితాలు ఉండకపోవడం మనమంతా గర్వించాల్సిన విషయం. కొత్తదనంతో ఉన్న ఏ పనిని చూసినా, ఆ పని గురించి విన్నా నా మనసు వెంటనే స్పందిస్తుంది. ఆ పనిని వెంటనే సిద్దిపేటలో ప్రారంభించాలని తపిస్తాను. ఇలా ఆలోచించడం వల్లే కోమటిచెరువు, అడ్వెంచర్ పార్క్, బోటింగ్, మెడికల్ కాలేజీ, 500 పడకల ఆస్పత్రి, భూగర్భ డ్రైనేజీ, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నళ్లు, కేంద్రీయ విద్యాలయం, విశాలమైన రహదారులు, పచ్చని మొక్కలు, రైతు బజార్, సమీకృత మార్కెట్ తోపాటు ఇంకా ఎన్నో పనులు మన కళ్లముందు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంగా మారింది.  పట్టణం చుట్టూరా పది కిలోమీటర్ల వరకు అభివృద్ధి విస్తరించింది. అన్ని రంగాల్లో పట్టణం ముందుండడంతో పెద్దపెద్ద షాపింగ్ మాళ్లు సిద్దిపేటలో వెలిసాయి. ఇక ఏది కావాలన్నా హైదరాబాద్ కు వెళ్లాల్సిన పని లేదు. ఆరోగ్యానికి, వినోదానికి, ఆహ్లాదానికి, వాణిజ్యానికి, భద్రతకు, ఉన్నత విద్యకు, ఉపాధి కల్పనకు సిద్దిపేట ప్రాంతాన్ని చిరునామాగా మార్చడంలో మీరు అందించిన చైతన్యం ఎనలేనిది. మీ స్పూర్తి లేకుంటే ఎన్ని పనులు తలపెట్టినా ఆచరణ సాధ్యమయ్యేది కాదు. ఉద్యమ బాటలో.. బంగారు సిద్దిపేటలో నన్ను ఆశీర్వదిస్తున్న మీ అందరికీ ఎంత చేసినా తక్కువే.. తీర్చుకోలేని రుణాన్ని నాకు అందించారు.. అందుకే ఊపిరి ఉన్నంత కాలం మీ సంక్షేమం కోసమే ముందుకు నడుస్తా అని మాట్లాడారు.

error: