కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన

పూంచ్‌: జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ ఆర్మీ వరుసగా మూడో రోజు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. గురువారం రాష్ట్రంలోని పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు జరిపింది. అలాగే, బుధవారం రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మంగళవారం కూడా భారత్‌ను రెచ్చగొట్టే విధంగా రాజౌరీలోని నౌషెరా సెక్టార్‌ నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరిపింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న ఉగ్రదాడి జరిగి 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మరికొందరు గాయాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పాక్‌.. రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోంది.

‘2003లో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘిస్తోంది ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని భారత్‌ సూచిస్తున్నప్పటికీ తమ తీరుని కొనసాగిస్తోంది’ అని భారత రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. బుధవారం సాయంత్రం 4.30కి పాక్‌ తీవ్ర స్థాయిలో కాల్పులకు తెగబడిందని చెప్పారు. పాక్‌ ఆర్మీ కాల్పులను భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయని తెలిపారు. జనవరిలో కూడా పాక్‌ పలుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కాగా, సరిహద్దుల్లో 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 2018లో పాక్‌ అత్యధికంగా 2,936 సార్లు ఈ ఒప్పందానికి తూట్లు పొడిచింది.

error: